మనుషుల ప్రాణాలకే గ్యారెంటీ లేదు. ఎక్స్పైరీ డేట్ రాగానే ఎవరైనా తట్టాబుట్టా సర్దుకుని వెళ్లాల్సిందే. అలాంటిది ఓ కోడి మాత్రం రికార్డును సృష్టిస్తోంది. అమెరికాలోని మిచిగాన్ నగరానికి చెందిన పీనట్ అనే కోడి ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ రోజులు బ్రతికిన కోడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ కోడికి సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అందరి దృష్టి ఈ కోడిపైనే పడింది.
ప్రపంచంలో ఎక్కడ వెతికినా పీనట్ లాంటి కోడి కనిపించదు. చూడటానికి మిగతా కోళ్లలాగే ఉన్నా అందరికంటే ఎంతో స్పెషల్ ఇది. బాంటమ్ జాతికి చెందిన పీనట్ 2002 సంవత్సరంలో జన్మించింది. అయితే పీనట్ తల్లి గుడ్లు పెట్టగానే ఆ గుడ్లన్నింటినీ వదిలేసింది. మెర్సీ డార్విన్ అనే మహిళ ఈ గుడ్లను సేకరించి పెంచుకుందామనుకుంది. అన్ని గుడ్లల్లో ఓ గుడ్డు చల్లగా ఉండటంతో అది ఇక బ్రతకదని పడేద్దామని నిర్ణయించుకుంది.
కానీ అప్పుడే ఆ గుడ్డు నుంచి కోడి పిల్ల బయటకు రావడంతో ఆ నిర్ణయాన్ని విరమించుకుంది. అలా వచ్చిన ఓ కోడిపిల్లే పీనట్. పీనట్ ను తన తల్లి మిగతాపిల్లలతో పెరగనివ్వలేదు. దీంతో మెర్సీ ఓ చిలుక పంజరంలో దీనిని పెంచింది. తల్లిప్రేమకు దూరమైన ఈ కోడి ఇప్పుడు ప్రపంచమే తనవైపు చూసేలా రికార్డు సృష్టించింది. సాధారణంగా కోళ్లు 5 నుంచి 10 ఏళ్లు బ్రతుకుతాయి. కానీ పీనట్ ఏకంగా 20 సంవత్సరాల 304 రోజులు జీవించి ప్రపంచంలోనే ఎక్కువ కాలం బ్రతికిన కోడిగా గుర్తింపు సంపాదించుకుంది.