200 crore defamation suit by cricket board against ex-captain
mictv telugu

మాజీ కెప్టెన్‌పై క్రికెట్ బోర్డు 200 కోట్ల పరువునష్టం దావా

August 16, 2022

200 crore defamation suit by cricket board against ex-captain

దేశానికి ప్రపంచకప్ అందించిన మాజీ కెప్టెన్ అర్జున రణతుంగపై రూ. 200 కోట్లకు పరువునష్టం దావా వేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు లెటర్స్ ఆఫ్ డిమాండ్ పంపించినట్టు బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది. సోమవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ సమావేశంలో ఈ అంశం చర్చకు రాగా దావా వేయడానికే ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రణతుంగ చేసిన వ్యాఖ్యలు దేశ క్రికెట్‌ని దెబ్బతీసేలా ఉన్నాయని, ఉద్దేశపూర్వకంగా ద్వేష భావనలు గుప్పించాడని ఆరోపించింది.

అంతకుముందు రణతుంగ ఓ మీడియాతో క్రికెట్ గురించి మాట్లాడుతూ బోర్డుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ పతనం కావడం, బోర్డు వ్యవహారాల్లో స్థిరత్వం లేకపోవడం, అవినీతి వంటి విషయాలపై తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. దేశంలో అత్యంత అవినీతి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది క్రికెట్ బోర్డేనని, ప్రతీ అంశం గందరగోళంగా మారిందని వ్యాఖ్యానించారు. యువకుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో బోర్డు పూర్తిగా విఫలమైందని, వారిపై చూపే ధోరణి పరమచెత్తగా ఉందని విమర్శించారు. దీంతో బోర్డు తీవ్ర ఆగ్రహం చెంది పై నిర్ణయం తీసుకుంది. కాగా, అర్జున రణతుంగ ఇటీవల జాతీయ స్పోర్ట్ కౌన్సిల్‌కు చైర్మెన్‌గా నియమితులయ్యారు.