గ్రామీణ పండుగ సంక్రాంతి సందర్భంగా నగర ప్రజలు ఊరి బాట పట్టారు. ఇప్పటికే బస్సులు, రైళ్లు, విమానాల్లో రద్దీ పెరగగా, తాజాగా స్వంత వాహనాలు ఉన్నవారితో రహదారులు నిండిపోతున్నాయి. హైదరాబాద్ – విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారిపై వాహనాలు బారులు తీరుతున్నాయి. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల సంఖ్యతో పాటు రద్దీ కూడా భారీగా పెరిగింది. విజయవాడ వైపు 10 గేట్లు తెరిచినప్పటికీ వాహనాల క్యూ 200 మీటర్ల వరకు ఉంది. గురువారమే పరిస్థితి ఈ రకంగా ఉంటే ఇక శుక్ర, శనివారం రోజుల్లో ఇంకెంత ట్రాఫిక్ ఉంటుందోనని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. అటు ప్రజలు సొంత గ్రామాలకు పయనమవుతుండడంతో హైదరాబాద్ నగరం నెమ్మదిగా ఖాళీ అవుతోంది. ఇప్పటికే మేజర్ ఏరియాల్లో ట్రాఫిక్ భారీగా తగ్గగా, శుక్ర, శనివారాలలో మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే పండుగకు ఊరెళ్లేవారు వాహనాలను జాగ్రత్తగా నడపాలని, సంతోషంగా ఉండాల్సిన వేళ ప్రమాదాల బారిన పడి కుటుంబ సభ్యులకు శోకాన్ని మిగల్చవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.