మూసిలో కొట్టుకుపోయిన 200 ట్రాన్స్ఫార్మర్లు - MicTv.in - Telugu News
mictv telugu

మూసిలో కొట్టుకుపోయిన 200 ట్రాన్స్ఫార్మర్లు

October 14, 2020

200 transformers gone in musi river

గత ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా మూసీ న‌దికి వ‌ర‌ద పోటెత్తింది. దీంతో మూసీ న‌ది ప‌రివాహ‌క ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు బిక్కు బిక్కుమంటూ నివ‌సిస్తున్నారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు జీహెచ్ఎంసీ అధికారులు త‌ర‌లిస్తున్నారు. వర్షాల కారణంగా హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో విద్యుత్ సమస్య ఏర్పడింది. దీనిపై ట్రాన్స్ కో ,జెన్కో సిఎండి ప్రభాకర్ రావు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..’ఎన్టీపీసీ వారి సహకారంతో గ్రిడ్ కు ఇబ్బంది లేకుండా చేశాం. మన గ్రిడ్ కు ఎలాంటి ఇబ్బంది లేదు. కరెంట్ డిమాండ్ ఎంత తగ్గినా.. ఎంత పెరిగినా గ్రిడ్ కి ఎలాంటి డోకా లేదు. హైదరాబాద్ లో విద్యుత్ లేకపోవడం కాదు. అపార్ట్మెంట్ లలోకి నీరు రావడంతో మేమె నిలిపి వేశాం. చాలా చోట్ల సబ్ స్టేషన్ లలో నీరు చేరింది. నీరు తొలిగిపోగానే విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరిస్తాం. మూసి నది ప్రవాహంలో 200 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకుపోయాయి. ఆయా ప్రాంతాల్లో చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిపేశాం. ఎక్కడైనా స్తంభాలు, విద్యుత్ తీగలు తెగిపడితే వెంటనే మాకు సమాచారం ఇవ్వండి. హైడల్ విద్యుత్ పూర్తి స్థాయిలో నడుస్తున్నాయి. కానీ, 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తాం. శ్రీశైలం విద్యుత్ సంబంధించి త్వరలోనే నివేదిక వస్తుంది. దురదృష్టవశాత్తు అందులో అధికారులకు కరోనా సోకడంతో కొంత ఆలస్యం అయింది.’ అని అన్నారు.