అదరగొట్టిన ముంబై.. నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం - MicTv.in - Telugu News
mictv telugu

అదరగొట్టిన ముంబై.. నాలుగోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం

May 13, 2019

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బాటింగ్ ఎంచుకున్న ముంబై.. 20 ఓవర్ల‌లో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆ తర్వాత 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు మాత్రమే చేసి, ఒక్క పరుగుతో తేడాతో ఓటమి పాలైంది.

ముంబై ఆటగాళ్లలో.. పోలార్డ్ 25 బంతుల్లో 41 పరుగులు చేసి( నాటౌట్) గా నిలవగా.. డికాక్ 17 బంతుల్లో 29, ఇషన్ కిషన్ 26 బంతుల్లో 23, కెప్టెన్ రోహిత్ 14 బంతుల్లో 15, సూర్యకుమర్ యాదవ్ 17 బంతుల్లో 15, హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో 16 పరుగులు చేశారు.

చెన్నై ఆటగాళ్లలో వాట్సన్ 59 బంతుల్లో 80 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్  ఆడినా.. చెన్నై‌కి ఓటమి తప్పలేదు. చివరి ఓవర్ దాకా నిలకడగా ఆడుతూ.. ఆఖరి ఓవర్లో రన్ ఔట్ కావడంతో చెన్నై ఆశలు ఆవిరి అయ్యాయి. డు ప్లెసిస్ 13 బంతుల్లో 26 పరుగులు చేయగా.. కెప్టెన్ ధోని 8 బంతుల్లో కేవలం 2 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. సురేష్ రైనా 14 బంతుల్లో 8, అంబటి రాయుడు 4 బంతుల్లో 1, బ్రావో 15 బంతుల్లో 15 పరుగులు చేశారు.  

2019 indian premier league final match win mumbai indians on Chennai super kings...

చివరి ఓవర్లో చెన్నై గెలుపుకు 9 పరుగులు చేయాలి. తొలి 3 బంతుల్లో 4 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి రెండో పరుగు కోసం వెనక్కి వచ్చిన వాట్సన్‌ రనౌటయ్యాడు. అప్పటి వరకు చెన్నై చేతుల్లో ఉన్న మ్యాచ్‌ ముంబయి వైపు తిరిగింది. 2 బంతుల్లో 4 పరుగులు అవసరం కాగా.. ఐదో బంతికి 2 తీసిన శార్దూల్‌ చివరి బంతికి  ఔట్ అయ్యాడు.

అఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన మలింగ ముంబై గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు ఆ జట్టును పోటీలో నిలబెట్టింది మాత్రం బుమ్రానే. ఉత్కంఠలో, ఒత్తిడిలో అతను బౌలింగ్‌ చేసిన తీరు అద్భుతం. మలింగ వేసిన 16వ ఓవర్లో 20 పరుగులు రాబట్టి వాట్సన్‌, బ్రావో ఊపుమీదున్న దశలో బౌలింగ్‌కు వచ్చిన బుమ్రా కేవలం నాలుగే పరుగులిచ్చాడు. తర్వాతి ఓవర్లో కృనాల్‌ 20 పరుగులు ఇచ్చాడు. 2 ఓవర్లలో 18 పరుగులు చేస్తే చాలు. ఆ స్థితిలో బ్రావో వికెట్‌ తీసి 9 పరుగులే ఇచ్చాడు.

అలాగే మంబై 149 పరుగులు చేయడంలో పొలార్డ్ కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పొలార్డ్‌ చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగి 25 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 41 (నాటౌట్‌) పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. ఈ సీజన్ పెద్దగా రాణించని పొలార్డ్ ఫైనల్‌లో జట్టును ఆదుకుని ముంబైకి విజయాన్ని అందించాడు. గతంలో ముంబయి ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచినప్పుడు తన బౌలింగ్‌, ఫీల్డింగ్‌తో సత్తా చాటిన పొలార్డ్‌.. ఇప్పుడు మరోసారి ముంబై ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు.