Home > 2019 Roundup > 2019 రౌండప్.. బీజేపీ అజెండా  సక్సెస్.. ఇంకా ఎన్నెన్నో 

2019 రౌండప్.. బీజేపీ అజెండా  సక్సెస్.. ఇంకా ఎన్నెన్నో 

bmg02

కాలం వేగంగా మారిపోతూ ఉంటుంది. ప్రతి ఏటా కొన్ని తీపి జ్ఞాపకాలను, కొన్ని చేదు గుర్తులు మిగిల్చి పోతూనే ఉంటుంది. 2019 ఏడాది కూడా వేగంగా మారిపోయింది.ఈ ఏడాది దేశంలో ఎన్నో సంచలనాలను సృష్టించింది. ముఖ్యంగా దేశ రాజకీయ ముఖచిత్రాలను కొత్తగా చూపించింది. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు కొన్ని రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు అధికార పీఠాలను కదిల్చాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి రావడం, ఆర్టికల్ 370 రద్దు లాంటి సాహసోపేతమైన నిర్ణయాలు, ఏపీలో టీడీపీ అధికారం కోల్పోయి జగన్ పాలన పగ్గాలు చేపట్టారు. దేశం రాజకీయాల్లో ఏఏ కీలక పరిణామాలు రాజకీయాల్లో ఏ విధంగా చోటు చేసుకున్నాయి. ఈ ఏడాదిలో ఏం మారింది? గిర్రున తిరిగిపోయిన ఈ ఏడాది మనకు ఏం నేర్పిందో ఓసారి నెమరువేసుకుందాం.

మోదీ విజయ బావుటా :

అప్పటి వరకూ సంకీర్ణ యుగంగా మారిన దేశ రాజకీయ చరిత్రను ప్రధాని మోదీ అమిత్ షా ద్వయం 2014 ఎన్నికల్లో పూర్తిగా మార్చేసింది. ఒంటరిగా భారీ మెజరిటీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా మిత్ర ధర్మం కోసం పొత్తుపెట్టుకున్న పార్టీలతో ఎన్డీయే ప్రభుత్వాన్ని నడిపింది. 2014 నుంచి ఐదేళ్ల తర్వాత ఏప్రిల్‌-మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఈసారి గత చరిత్రలకు భిన్నంగా బీజేపీ అఖండ విజయాన్ని సాధించింది. ఏకంగా 303 స్థానాల్లో విజయం సాధించి మోదీ, అమిత్ షాల పరపతిని మరింత పెంచేసింది. గత ఎన్నికల్లో 256 స్థానాల్లో విజయం సాధించగా పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, నల్లధనం వెలికి తీయకపోవడం లాంటి ఎన్నో వ్యతిరేక పవనాలు ఉన్నాయని ప్రచారం సాగినా వాటన్నింటిని పటా పంచలు చేశారు. బీజేపీ చరిత్రలో ఎన్నడూ లేనన్ని సీట్లు సాధించి పాలనను సుస్థిరం చేసుకున్నారు. ఈ విజయం మోదీ పాలనలో మరింత దూకుడు పెంచే అవకాశాన్ని కల్పించింది.

కుదేలైన కాంగ్రెస్ పార్టీ :

కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది ఢీలా పడిపోయింది. కనీసం ఆ పార్టీకి పూర్తి స్థాయి రథసారథిని కూడా నియమించుకునే పరిస్థితులు లేకుండా ఈ ఏడాది కాంగ్రెస్‌కు కన్నీటిని మిగిల్చింది. ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 52 సీట్లను గెలిచింది. 2014 ఎన్నికల్లో 44 స్థానాల్లో మాత్రమే విజయం సాధించగా ఈ ఏడాది మాత్రం సీట్లను మెరుగుపరుచుకుంది. కానీ మోదీపై వ్యతిరేకతను ఆ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైంది. ఈసారి ఎన్నికల్లో పూర్తిగా రాహుల్ గాంధీ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. అధ్యక్ష హోదాలో కాలికి బలపం కట్టుకున్నట్టుగా దేశమంతా చుట్టి వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీని కనీసం 100 స్థానల్లో గెలిపించలేకోయారు. దీంతో ఆయన నాయకత్వంపై విమర్శలు వచ్చాయి. దీన్ని జీర్ణించుకోలేని ఆయన పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దిక్కుతోచని స్థితిలో పడిన కాంగ్రెస్ చివరకు ఈ వయస్సులో కూడా సోనియా గాంధీ మళ్లీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. గతంలో ఎన్నడూ లేనంతగా కాంగ్రెస్ పార్టీ కుదేలైపోయింది. రాబోయే రోజులలో కోలుకుంటుందా లేదా అన్నంత దారుణంగా ఈ ఏడాది ఆ పార్టీకి చేదు గుర్తులను మిగిల్చి వెళ్లింది.

జగన్ జైత్రయాత్ర :

ఏపీ ఎన్నికల చిత్రంలో జగన్మోహన్ రెడ్డి చరిత్రలను తిరగరాశారు. కనీవినీ ఎరుగని రీతిలో అఖండ విజయాన్ని అందుకున్నారు. అధికార టీడీపీని, 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు రాజకీయ చతురతను మట్టి కరిపించారు. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల్లో 23 పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి ఔరా అనిపించారు. 9 ఏళ్లుగా వేచి చూసిన ఎదురు చూపులు ఈ ఏడాది ఫలితాన్ని ఇచ్చాయి. సుదీర్ఘ పాదయాత్ర తర్వాత అనూహ్య విజయాన్ని ఈ ఏడాది జగన్ కైవసం చేసుకున్నారు. కేవలం టీడీపీని 23 స్థానాలకే పరిమితం చేసింది. ఇక జనసేన ఏకైక ఎమ్మెల్యే మాత్రమే అడుగు పెట్టగా ఆ పార్టీ అధినేత పవన్ కల్యాన్ రెండు చోట్లా ఓటమి మూటగట్టుకున్నారు. ఒక్కఛాన్స్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు గుర్తు చేసుకొని ఏకంగా ఘన విజయాన్నే కట్టబెట్టారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ రాజకీయనాయకుడికి లేనంతగా పరపతి జగన్‌కు ఈ ఏడాదిలో దక్కింది.

తగ్గని గులాబీ.. విరిసిన కమలం

తెలంగాణలో ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు కొత్త జోష్ తెప్పించాయి. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దుందుభి మోగించిన టీఆర్ఎస్ తర్వాత కూడా తన హవా చాటుకుటుంది. పంచాయితీ ఎన్నికల్లో ఏకఛత్రాధిపత్యం ప్రదర్శించింది. మరోపక్క.. బీజేపీ కూడా బలం చాటింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న నాలుగు సిట్టింగ్ స్థానాలు కూడా చేజారిపోయినా సరిగ్గా ఆరునెలలకే 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుంది. ఏకంగా రాష్ట్రం నుంచి నలుగురిని ఎంపీలుగా గెలిపించారు ఇక్కడి ప్రజలు. గతంలో ఎన్నడూ లేనంతగా బీజేపీ తరుపున తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో గెలిచిన నలుగురు కూడా తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికైన వారే ఉండటం విశేషం. ఈ జోష్‌తో బీజేపీ తన ఫోకస్ తెలంగాణపై పెట్టింది. దక్షిణాదిలో పాగా వేసేందుకు ఇక్కడి నుంచే వ్యూహం అమలు చేయాలని యోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి 2019 మిగిల్చిన జోష్ 2020లోనూ ఆ తర్వాత సంవత్సరాల్లోనూ కంటిన్యూ అవుతుందో లేదో చూడాలి.

కర్ణాటకలో కూలిన సంకీర్ణం

గత ఏడాది జరిగిన కర్నాటక ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు అడుగు దూరంలో ఆగిపోయింది. వెనకాలే బీజేపీ కూడా పోటీగా ఉండటంతో సోనియా గాంధీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ - జేడీఎస్ కలిసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఎక్కవ స్థానాల్లో తాము గెలిచినా సీఎం పీఠాన్ని వదులుకొని జేడిఎస్ నుంచి కుమార స్వామిని సీఎం చేశారు. కానీ ఇది మూడునాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. 2019లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే కర్నాటకలో మెల్లగా సంక్షోభం ప్రారంభం అయింది. కాంగ్రెస్ పార్టీ నుంచి 15 మంది, జేడీఎస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో విశ్వాస పరీక్షలో కుమార స్వామి విఫలం అయ్యారు. ఆ తర్వాత బీజేపీ నుంచి యడియూరప్ప సీఎం పీఠం ఎక్కారు. తర్వాత 15 స్థానాల్లో ఉప ఎన్నికల్లోనూ బీజేపీ తరుపున బరిలోకి దిగిన రెబల్ అభ్యర్థులు 9 మంది విజయం సాధించగా, కాంగ్రెస్ 3, జేడీఎస్ 2 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో సంకీర్ణ ప్రభుత్వం పోయి బీజేపీ సుస్థిర పరిపాలన చేపట్టేందుకు వీలు ఏర్పడింది.

మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేన

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగానే శివసేన పార్టీ తీరు స్పష్టంగా కనిపిస్తుంది. బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నా ఆ పార్టీకి నచ్చని అంశాలను కుండ బద్దలు కొట్టినట్టుగా తేల్చి చెబుతుంది. ఆ పార్టీ ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటుందో బీజేపీకి అంతు చిక్కకుండా చేస్తుంది. అలాంటి పార్టీ ఈ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరిణామాన్ని ఎదుర్కొనేలా చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసినా ఫలితాలు వచ్చాక ప్లేటు మార్చేసింది. తమకే సీఎం పదవి కావాలని మెలిక పెట్టింది. బీజేపీ ఏ పార్టీ మద్దతు తీసుకునే పరిస్థితి లేకపోవడంతో శివసేనకు మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్, ఎన్సీపీ ముందుకు వచ్చాయి. పొత్తులు పొడిచే సమయంలో ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ బీజేపీ వెపు వెళ్లారు. ఆ వెంటనే హడావిడిగా ప్రమాణ స్వీకారం చేసినా పెద్దగా ఫలితం లేకపోయింది. వెంటనే అజిత్ ఎన్సీపీ గూటికి చేరడం. శివసేన నుంచి ఉద్దవ్ సీఎంగా బాధ్యతలు తీసుకోవడం జరిగిపోయాయి. ఈ ఏడాది నిజంగా శివసేన పార్టీకి చారిత్రక ఘట్టం అనే చెప్పవచ్చు. శివసేన ఏర్పడినప్పటి నుంచి ఏనాడూ బాల్ థాక్రే కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడలేదు. కానీ ఉద్దవ్ కుమారుడు ఆదిత్య థాక్రే వర్లీ నుంచి తొలిసారి ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. ఉద్ధవ్ థాక్రే అయితే ఏకంగా సీఎం అయ్యారు. మరాఠ పులిగా పేరు పొందిన బాల్ థాక్రే కుటుంబం నుంచి తొలిసారి ఆ రాష్ట్ర పాలన చేపట్టడం విశేషం.

ఆర్టికల్ 370 రద్దు

జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టీకల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా రాష్ట్రంగా ఉన్న జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు. కొన్ని ప్రత్యేక చట్టాలు అక్కడ వర్తించకుండా, ప్రత్యేక జెండా ఉన్న కశ్మీర్ ను పూర్తిస్థాయిలో భారతదేశంలో అంతర్భాగంగా మార్చివేస్తూ చరిత్ర సృష్టించారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. 1954 ఉత్తర్వులను ఉపసంహరించుకుని, దేశ రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను వర్తించేలా చేశారు. ఎలాంటి అల్లర్లకు తావులేకుండా పటిష్ట బందో బస్తు ఏర్పాటు చేసి శాంతిని నెలకొల్పారు.

అయోధ్య తీర్పు :

దశాబ్ధాలుగా నలుగుతూ వస్తున్న అయోధ్య వివాదం ఈ ఏడాదిలోనే కొలిక్కి వచ్చింది. రెండోసారి బీజేపీ అధికారంలోకి రావడంతో మూడు దశాబ్ధాల సందిగ్ధత పూర్తిగా తొలిగిపోయింది. ఎటువంటి అల్లర్లు, వివాదాలు లేకుండా సుప్రీం కోర్టు సామరస్య వాతావరణంలో తీర్పు వెల్లడించింది. బాబ్రీ మసీదు ఉన్న స్థలం రాంలల్లాకే చెందుతుందని, మసీదు నిర్మాణం కోసం మరో చోట 5 ఎకరాల స్థలం కేటాయించాలని సూచించింది. దీంతో రామ మందిరం నిర్మాణం కోసం అడ్డంకులు పూర్తిగా తొలిగిపోయాయి. చాలా మంది ఈ నిర్ణయాన్ని హర్షించారు. రివ్యూ పిటిషన్‌కు వెళ్లాలని నిర్ణయించిన సున్నీ వక్ఫ్ బోర్డు తన మనసు మార్చుకుంది. చాలా ఏళ్ల తర్వాత ఈ ఏడాది అయోధ్య కేసులో పరిష్కారం లభించింది.

పౌరసత్వ చట్ట సవరణ :

ప్రధాని మోదీ తీసుకున్న మరో అతిపెద్ద కీలక నిర్ణయంలో పౌరసత్వ సవరణ బిల్లు కూడా ఒకటి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్,బంగ్లాదేశ్‌లో మతపరమైన వేధింపులు ఎదుర్కొంటున్న హిందూ, సిక్కు, బౌద్ద, క్రైస్తవ, జైనులకు ఐదేళ్ల పాటు నివాసం ఉంటే ఎటువంటి ధృవపత్రాలు లేకున్నా వారికి పౌరసత్వాన్ని ఇచ్చేందుకు దీన్ని తీసుకువచ్చారు.1955 నాటి పౌరసత్వ బిల్లులో కొన్ని అంశాలను సవరిస్తూ ముస్లిమేతరులకు ఊరట కలిగించేలా ఈ కొత్త చట్టం చేశారు.రోహింగ్యా ముస్లింలను పూర్తి దేశంలోకి అడుగు పెట్టనివ్వబోమని కేంద్ర తేల్చి చెప్పింది. ఈ చట్ట సవరణకు 125 మంది అనుకూలంగా, వ్యతిరేకంగా 99 మంది ఓటేశారు. వేయడంతో చట్ట సవరణ పూర్తైంది. కానీ కేంద్రం చేసిన ఈ చట్ట సవరణ దేశవ్యాప్తంగా అగ్గిరాజేసింది. మెల్లగా ప్రారంభమైన ఉద్యమం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది. ఈశాన్య రాష్ట్రాలు, ముస్లింలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ బలంగా తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. విపక్షాలు కూడా కేంద్రం నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. ముస్లింలపై వివక్ష చూపారని, వారు దేశంలో రెండో తరగతి పౌరులుగా మిగిలిపోతారని అంటున్నాయి. అన్ని రాష్ట్రాల్లో విద్యార్థులు, విద్యావంతులు, మేధావులు వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత వ్యతిరేకత ఎదుర్కొన్న చట్టం ఇదే కావడంతో పాటు ఇదే కావడం విశేషం.

రేపిస్ట్ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు

దేశ రాజకీయాల్లో సంచలనమైన తీర్పు కూడా ఈ ఏడాదే వెలుబడింది. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యూపీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ స్పెషల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. సిట్టింగ్ ఎమ్మెల్యేకు జీవిత ఖైదు శిక్ష పడటం ఇదే ప్రథమం కావడం విశేషం.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌లో బాలికపై అత్యాచారం కేసులో ఇది జరిగింది. బాధితురాలికి రూ. 25 లక్షల పరిహారం కూడా చెల్లించాలని ధర్మాసనం ఆదేశించింది.

2017లో కుల్దీప్, అతని అనుచరులు తనను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని బాలిక కేసు పెట్టింది. కేసు నమోదు చేసిన తర్వాత ఆమె తండ్రిపై ఓ తప్పుడు కేసు నమోదు కావడంతో అతడు విచారణలోనే చనిపోయాడు. బాధితురాలు కోర్టు వాయిదాలకు వెళ్తున్న సమయంలో ఆమెపై హత్యాయత్నం జరిగింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ కేసులో న్యాయం కోసం సుప్రీం కోర్టు తలుపు తట్టగా అత్యున్నత ధర్మాసనం ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేసి విచారణ వేగం పెంచి కీలక తీర్పును ఇచ్చింది.

మొత్తానికి ఈ ఏడాది కొన్ని పార్టీలకు, రాజకీయ నాయకులకు చేదు అనుభవాన్ని, కొందరికి తీపి గుర్తులను మిగిల్చింది. రాజకీయాల్లో చోటుచేసుకోవాల్సిన అనేక పరిణామాలు, కీలక నిర్ణయాలు దశాబ్ధాలుగా పెండింగ్‌లో ఉన్న తీర్పులు ఈ ఏడాదిలోనే వెలువడ్డాయి. ఎలా చూసినా 2019 అత్యంత కీలకంగా చరిత్రలో నిలిచిపోయిందనే చెప్పాలి.

Updated : 23 Dec 2019 8:47 AM GMT
Tags:    
Next Story
Share it
Top