2022 మిస్ ఇండియా విజేతగా కర్ణాటక యువతి - MicTv.in - Telugu News
mictv telugu

2022 మిస్ ఇండియా విజేతగా కర్ణాటక యువతి

July 4, 2022

ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో గతకొన్ని రోజులుగా జరుగుతున్న 2022 మిస్ ఇండియా పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఈ పోటీల్లో పలు రాష్ట్రాల యువతులు పోటీపడగా, ఈసారి 2022 మిస్ ఇండియా కిరీటాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందిన 21 ఏళ్ల సినిశెట్టి సొంతం చేసుకుంది. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫైనల్స్‌లో నిర్వాహకులు 58వ ఫెమీనా మిస్ ఇండియా విన్నర్‌గా సినిశెట్టిని ప్రకటించారు.

అనంతరం సినిశెట్టి మాట్లాడుతూ.. ”ఈ ప్రయాణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇందులో భాగమై నాకు అడుగడుగునా సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నా తల్లిదండ్రులకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను” అని ఆమె అన్నారు. సినిశెట్టి స్వరాష్ట్రం కర్ణాటకనే అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే. ఆమె అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం ఛార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ కోర్స్ చేస్తున్నారు.

మరోపక్క ఈ పోటీల్లో సినిశెట్టి మొదటి విజేతగా నిలువగా, రాజస్థాన్‌కు చెందిన రూబల్ షెకావత్ రెండో రన్నరప్‌గా నిలిచింది. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సినట చౌహాన్ మూడో స్థానాన్ని దక్కించుకోగా, మిస్ తెలంగాణ ప్రజా అయ్యగారి నాలుగో స్థానానికి పరిమితం అయ్యారు. అయితే, ఇప్పటివరకు మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న లారా దత్తా, సారా జేన్ డయాస్, సంధ్యా ఛాబ్, నఫీసా జోసెఫ్, రేఖ హండె, లిమారైనా డిసౌజా, సినిశెట్టి కర్ణాటకకు చెందినవారే కావటం గమనార్హం.