కంటెంట్ ఉంటే చాలు ఏ సీనిమా అయినా హిట్ కొడుతుంది అని నిరూపిస్తూనే ఉన్నారు తెలుగు ప్రేక్షకులు. అది ఏ భాష అయినా పర్వాలేదు. హీరో ఎవరైనా నష్టం లేదు. బొమ్మ బాగుందా లేదా అన్నదే ముఖ్యం. ప్రతీ యేడాది తెలుగులోకి చాలా సినిమాలు డబ్ అవుతుంటాయి. కానీ అన్ని సినిమాలు హిట్ అవ్వవు. థియేటర్లకు వెళ్ళి డబ్బింగ్ సినిమాలు చూడాలంటే దానిలో పస ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి. అలా ఉంటే ఏ భాష సినిమా అయినా తెలుగు రాష్ట్రాల్లో ఆడేస్తుంది.
ఈ యేడాది తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలే నెత్తిన కిరీటాలు తగిలించుకున్నాయి. అంచనాలకు మించి ఆడాయి అంటే కేవలం ఆ సినిమాల్లో ఉన్న కథాకమామీషు మాత్రమే. డబ్బింగ్ సినిమాల హోరులో తెలుగు పెద్ద హీరోల సినిమాలు కూడా అల్లల్లాడిపోయాయి. అలా 2022లో డబ్బింగ్ అయి వచ్చి హిట్ లు కొట్టిన సినిమాల మీద ఓ రౌండప్ వేసుకుంటే మొత్తం 5 సినిమాలు బాక్సాఫీస్ ను బద్దలుకొట్టాయి.
కేజీఎఫ్ 2:
అన్నిటింకన్నా ముందు చెప్పుకోవాల్సిన సినిమా ఇది. ముందు నుంచే ఈ సినిమా గురించి చాలా హైప్ ఉంది అందుకు తగ్గ అంచానాలు ఉన్నాయి. కేజీఎఫ్ 1 ని అన్ని భాషల ప్రేక్షకులు హిట్ చేశారు. దాంతో కేజీఎఫ్ రాక ముందు నుంచే హిట్ కొడుతుందని అనుకున్నారు. కానీ ఇంత భారీ హిట్ కొడుతుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. వేసవిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళ వర్షం కురిపించింది. ఇది కూడా పాన్ ఇండియా మూడా అనిపించుకుంది. కోలార్ ఫీల్డ్స్, మాఫియా నేపథ్యంలో వచ్చిన కేజీఎఫ్ సీరీస్ లో హీరో, విలన్ ఎలివేషన్స్, సంగీతం హైలట్. హీరోతో సమానంగా విలన్ కూ ప్రాధాన్యం ఇచ్చిన సినిమా ఇది. రొటీన్ కు భిన్నంగా ఉండడమే కాకుండా ఓ కొత్త తరహా కథనం కూడా ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం అయింది.
విక్రమ్:
పెద్ద యాక్టర్స్ నటించిన ఈ సినిమా ఓ ఊపు ఊపింది. ఇందులో ఓ కొత్త టెక్నిక్ ను పరిచయం చేశారు దర్శకుడు లోకేశ్ కనగరాజ్. కొత్త కథకు పాత సినిమాలతో ముడిపెడుతూ సినిమాటిక్ యూనివర్స్ ను పరిచయం చేశారు. కమల్ పాత సినిమా ఏజెంట్ విక్రమ్, కార్తీ సినిమా ఖైదీ సినిమాల్లోని పాత్రలు మళ్ళీ కనిపించడం, గుర్తుకువచ్చేట్టు చేయడం ప్రేక్షకులకు కొత్తదనం ఇచ్చింది. ఇక కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ ముగ్గురూ ముగ్గురే. ఎవరికి వాళ్ళు చించేసారు సినిమాలో. లాస్ట్ లో సూర్య ఎంట్రీతో అయితే మాటలు కూడా చాలవు అన్నట్టు ఉంటుంది. సూర్య ఎంట్రీతో మూడోపార్ట్ కు తెర తీసిన విధానానికి కూడా తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
కాంతారా:
పైన చెప్పుకున్న రెండు సినిమాల గురించి ముందు నుంచీ అంచనాలు ఉన్నాయి. వాటి గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు కూడా. కానీ కాంతారా మూవీ విషయానికి వస్తే అది వేరే లెవల్. అసలు ఆ సినిమా ఒకటి ఉందని కానీ, అది తెలుగులోకి వస్తోందని కానీ ఎవ్వరికీ తెలియదు. కన్నడలోనే చిన్న సినిమాగా విడుదల అయి హిట్ కొట్టింది. తెలుగులో ఏ ముహూర్తాన అల్లు అరవింద్ డబ్బింగ్ చేయాలనుకున్నారో కానీ పెద్ద హిట్ అయి కూర్చుంది. సైలెంట్ గా వచ్చి ప్రభంజనం సృష్టించేసింది. ప్రకృతి- మనిషికి మధ్య సంబంధం ఎప్పుడూ ఉంటుంది, దాన్ని ఎవరూ విడదీయలేరు అన్న కాన్సెప్ట్ తో….దేవుడిని కూడా కలిపి తీసిని ఈ సినిమా తెలుగు వాళ్ళకు ఓ కొత్త సంస్కృతిని పరిచయం చేసింది. కథతో పాటూ విజువల్ వండర్, అద్భుతమైన మ్యూజిక్ కూడా తోడై ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేలా చేసింది. వరాహ రూపం పాటను మరుగున పడడాపికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
సర్దార్:
ఇన్వెస్టిగేషన్, పోలీస్ క్యారెక్టర్లు వేయడంలో, అలాంటి కథలు ఎంచుకోవడంలో కార్తీది ఒక డిఫరెంట్ స్టైల్. అలా చేసిన ప్రతీ సినిమాలో ఓ కొత్తదనం ఉంటుంది. సర్దార్ సినిమాలో కూడా తండ్రీకొడుకులుగా కార్తీ నటించాడు.మాయమైన సైనిక రహస్యాల ఫైల్ ను వెలికి పట్టుకునేందుకు ప్రయత్నించే ఓ పోలీస్ ఆఫీసర్, ఆ ఇన్వెస్టిగేషన్ లో తన తండ్రి గురించి తెలుసుకునే విషయాలు ఇవన్నీ ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. స్పై థ్రిల్లర్ కు మంచి ఉదాహరణ సర్దార్ సినిమా. తండ్రిగా కార్తీ నటన ఇరగదీసాడు. అలాగే వాటర్ ను బేస్ చేసుకుని ఎన్నెన్ని కుట్రలు జరుగుతాయనే విషయం కూడా చాలా బాగా చూపించాడు దర్శకుడు పి.ఎస్, మిత్రన్.
లవ్ టుడే:
ప్రదీప్ రంగనాథన్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. థియేటర్లలో ఆడకపోయినా ఓటీటీలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది. పెళ్ళి చేసుకోవాలనుకున్న ఇద్దరు జంట ఒక రోజు ఒకరి ఫోన్ లు ఒకరు మార్చుకోవాల్సి వస్తే ఏం జరిగింది అన్నది కథ. డిఫరెంట్ ఉన్న ఈ థాటే సగం హిట్ కొట్టింది. ఇప్పటి కాలంలో ఫోన్ వాడని వాళ్ళు ఎవ్వరూ లేరు కాబట్టి అందరూ ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు.
ఇవే కాకుండా మణిరత్నం డైరక్షన్ లో వచ్చిన పీఎస్ 1, సుదీప్ హీరోగా వచ్చిన విక్రాంత్ రోణ, మలయాళీ సినిమా జయజయజయహేలు కూడా ప్రేక్షకులను అలరించాయి. పీఎస్ 1 అంచనాలకు తగ్గట్టు బాక్సాఫీస్ బద్దలు కొట్టకపోయినా మంచి టాక్ ని అయితే తెచ్చుకుంది.