2022 Telangana state roundup major events in Telangana current affairs
mictv telugu

2022 తెలంగాణ రౌండప్.. మునుగోడు, ఢిల్లీ మరెన్నో..

December 26, 2022

2022 Telangana state roundup major events in Telangana current affairs

2014కు ముందున్న తెలంగాణ వేరు, తర్వాతి తెలంగాణ వేరు. 2022కు ముందున్న తెలంగాణ రాజకీయాలు వేరు, తర్వాతి రాజకీయాలు వేరు. అవును… 2022వ సంవత్సరంలో రాష్ట్ర రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. టీఆర్ఆర్, బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా తలపడిన రణస్థలంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీగా మారి రాజకీయాలను రానున్న కొత్త ఏడాదిలో కొత్త మలుపులు తిప్పడానికి సిద్ధమైంది. ఈ అతిపెద్ద రాజకీయ పరిణామంతోపాటు రాష్ట్రంలో మరెన్నో కీలక సంఘటనలు 2022లో చోటుచేసుకున్నాయి. వాటి గురించి..

పాదయాత్రల సంవత్సరం..

బీజేపీ, కాంగ్రెస్, వైఎస్సార్ తెలంగాణ పార్టీలు ఈ ఏడాది తెలంగాణను ఓ చుట్టుచుట్టాయి. అధికార, విపక్షాల శత్రుత్వం ఈ యాత్రల్లోనూ కనిపించింది. రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల, బండి సంజయ్, అరవింద్, రాజాసింగ్ వంటి నేతలు ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తూ ప్రజలకు చేరువ కావడానికి ప్రయత్నించారు. ప్రభుత్వం కూడా శాంతిభద్రతల పేరుతో విపక్ష నేతలను గృహనిర్బంధంలో ఉంచింది, అరెస్టులు చేసింది. పాదయాత్రల్లో అధికార, విపక్ష శ్రేణులు కొట్టుకుని గాయపడ్డాయి. వివాదాల కేరాఫ్ అడ్రస్, ఘోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జైలుకెళ్లింది ఈ ఏడాదే.

ఫామ్‌హౌస్ కొనుగోలు కేసు

నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడానికి బీజేపీ తరఫున కొందరు ప్రయ్నతించడం ఈ ఏడాది రాజకీయాల్లో మరో హైలెట్. గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, హర్షవర్ధన్ రెడ్డి బీజేపీలో చేరితే వందల కోట్లు, కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ ఉంటుందని నిందితులు చెప్పిన ఆడియోలు, వీడియోలు బయటికి రావడంతో బీజేపీ ప్రతిష్ట మసకబారింది. కాకపోతే ఈ డీల్‌లో బీజేపీ నేతల పేర్లు తప్ప ఆ పార్టీకి ప్రత్యక్ష సంబంధం లేకపోవడం కేసును నీరుగార్చే అంశం.
యాదాద్రి పునఃప్రారంభం, రామానుజుల ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ మార్చిలో పునఃప్రారంభించారు. 2వేల కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు. హైదరాబాద్ శివారు ప్రాంతం ముచ్చింతల్‌లో 66 మీటర్ల ఎత్తుతో భారీ వ్యయంతో నిర్మించిన రామానుజాచార్య విగ్రహాన్ని (సమతా విగ్రహం) ప్రధాని మోదీ మే నెలలో ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుకు వెయ్యి కోట్లు ఖర్చయింది.

ఢిల్లీ మద్యం స్కామ్..

ఢిల్లీ రాష్ట్రంలో చోటుచేసుకున్న మద్యం స్కాం డొంక కదిల్చిన దర్యాప్తు సంస్థలు తీగను హైదరాబాద్‌లో పట్టుకున్నాయి. ముడుపులు, పర్మిట్ల బాగోతంలో ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబ సభ్యులతోపాటు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బోయినపల్లి అభిషేక్ రావు తదితరుల పేర్లు చార్జిషీటులోకి ఎక్కాయి.

మునుగోడు ఎన్నికలు
టీఆర్ఎస్, బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కోట్లు ఖర్చు పెట్టిన మునుగోడు ఉప ఎన్నికలు రానున్న అసెంబ్లీ ఎన్నికల సీన్‌ను గుర్తుచేశారు. హోరాహోరీ పోరులో టీఆర్ఎస్ వామపక్షాల మద్దతుతో గెలుపొందింది. ఓడిన అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి బలమున్నా, ఇటీవలి ఉప ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ బలం పెరుగుతోందనడానికి ఈ ఎన్నికలు రుజువని విశ్లేషకుల అంచనా.
విషాదాలు..
తెలంగాణలో 2022లో చాలా విషాదాలు సంభవించాయి. బోయగూడలో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రమాదం 11 మంది బిహార్ కార్మికులు అసువులు బాశారు. వివిధ రోడ్లు ప్రమాదాల్లో వందలాదిమంది చనిపోయారు.
ఆర్థికం..
ఈ ఏడాది కూడా తెలంగాణకు పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. అమరరాజా బ్యాటరీల కంపెనీ (9,500 కోట్లు), క్యాపిటల్ ల్యాండ్ (6,200 కోట్లు), జపాన్ కంపెనీ దైపు (450 కోట్లు), అమోలెడ్ ఇండియా (24 వేల కోట్లు)తో మరెన్నో కంపెనీలు పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో గత 8 ఏళ్లలో రాష్ట్రానికి దాదాపు 3 లక్షల కోట్ల పెట్టుబడు వచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఓస్ ఎనిమిదేళ్ల పాలన తర్వాత భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరుతో జాతీయ పార్టీగా అవతరించింది. పేరు మార్పుకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్ కార్యాలయాన్ని డిసెంబర్ 14 ప్రారంభించారు. ఢిల్లీ పీఠమే తమ లక్ష్యమని, ఎర్రకోటపై గులాబీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా జాతీయస్థాయిలో తలపడనున్న పార్టీ తొలుత కర్ణాటక, మహారాష్ట్రల్లో అదృష్టం పరీక్షించుకోనుంది.

ఇవి కూడా చదవండి : 

2022 రౌండప్.. దేశంలో ఏం జరిగింది?

ఏపీలో మార్మోగుతున్న రంగా పేరు.. మధ్యలో నలిగిపోతున్న రాధా