ఈ రోజుల్లో యువత బాహ్యా సౌందర్యానికి ప్రాధాన్యతనిస్తూ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. జుట్టు ఊడిపోతుందన్న దిగులుతో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తరచూ షాంపూలు, నూనెలతో కంటికి రెప్పలా కాపాడుకుంటున్న శిరోజాలు.. ఇటీవల ఓ వింత జబ్బు కారణంగా వెంట్రుకలు రాలడం ప్రారంభమైంది. చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే జుట్టు మొత్తం ఊడిపోతూ రూపురేఖలన్నీ మారాయి. దీనికి చికిత్స కోసం ఆమె ఎన్నో చికిత్సలు చేయించుకుంది. కానీ ఫలితం లేకపోవడంతో విరక్తి చెంది, చివరకు బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ దుర్ఘటన కర్ణాటకలోని మైసూరు నగరంలో చోటుచేసుకుంది.
మైసూరులోని రాఘవేంద్ర ఎక్స్టెన్షన్లో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు అధికారులు శనివారం తెలిపారు. మృతురాలిని కావ్యశ్రీ (21) గా గుర్తించారు. వింత జబ్బు కారణంగా తల వెంట్రుకలు పూర్తిగా రాలిపోయాయని.. దీంతో మనస్థాపం చెందిన కావ్యశ్రీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై నజరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కావ్యశ్రీ మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.