విధ్వంసం సృష్టించిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దహనం, ఆస్తినష్టం కేసులో పోలీసులు 22 మందిని అరెస్టు చేశారు. ఇందులో ఏపీలోని గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన అభ్యర్ధులే ఎక్కువగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సాయి డిఫెన్స్ అకాడమీలో శిక్షణ తీసుకున్న అభ్యర్ధులు 450 మంది గుంటూరు నుంచి రైలులో హైదరాబాదుకు వచ్చినట్టు గుర్తించారు. వీరితో పాటు మంచిర్యాల, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, మహబూబ్ నగర్ అభ్యర్ధులు ఉన్నట్టు పోలీసులు తేల్చారు. ఇదిలా ఉండగా, బీహార్‌లో అల్లరిమూకలు రైల్వే స్టేషన్ నుంచి రూ. 3 లక్షలను ఎత్తుకెళ్లిపోయారు. అర్రాహ్ ప్రాంతంలోని రైల్వేస్టేషనులోని టిక్కెట్ కౌంటర్ నుంచి నగదు చోరీ అయినట్టు పోలీసులు తెలిపారు. మరోవైపు దేశ వ్యాప్తంగా అగ్నిపథ్ స్కీంకు వ్యతిరేకంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. అల్లర్లపై విచారణకు సిట్టింగ్ న్యాయమూర్తితో సిట్ ఏర్పాటు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. రైల్వే సహా, ప్రజా ఆస్తులకు వాటిల్లిన నష్టంపై విచారించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అంతేకాక, అల్లర్ల వల్ల జాతీయ భద్రత, సైన్యంపై పడే మానసిక ప్రభావాన్ని అధ్యయనం చేయాలని కోరారు.