22 యూట్యూబ్‌ ఛానెళ్లు నిషేధం: కేంద్రం - MicTv.in - Telugu News
mictv telugu

22 యూట్యూబ్‌ ఛానెళ్లు నిషేధం: కేంద్రం

April 5, 2022

modi

కేంద్రం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అసత్య వార్తలు, అసత్య ప్రచారాలు చేస్తున్న 22 యూట్యూబ్‌ ఛానెళ్లను నిషేధిస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. తమ ఛానెళ్ల ద్వారా అసత్య వార్తలు, అసత్య వీడియోలను చేస్తూ, కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించకుండా అసత్య వార్తలను రాస్తున్న వాటిని కట్టడి చేసేందుకు చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా 22 యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. వీటిలో 18 భారత్‌కు చెందినవి కాగా, మరో నాలుగు ఛానెళ్లు పాకిస్థాన్ కేంద్రంగా నడిచేవి ఉన్నాయి.

అయితే, ముఖ్యంగా జాతీయ భద్రత, విదేశీ సంబంధాలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నందున వీటిపై చర్యలు తీసుకున్నట్లు కేంద్ర సమాచారశాఖ వెల్లడించింది. యూట్యూబ్ ఛానెళ్లపై చర్యలు తీసుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. భారత్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై పలు యూట్యూబ్ ఛానెళ్లు అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

అంతేకాకుండా న్యూస్ ఛానెళ్ల మాదిరిగా లోగోలు, థంబ్ నెయిల్‌లు వాడుతూ వీక్షకులను తప్పుదోవ పట్టిస్తున్నట్లు గ్రహించింది. వీటితోపాటు భారత భద్రతా దళాలు, జమ్మూ కశ్మీర్ అంశాలతో పాటు భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కేంద్రంగా మరికొన్ని యూట్యూబ్ ఛానెళ్లు అసత్య సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారనే కారణంగా వాటిపై నిషేధం విధిస్తున్నట్లు కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.