ఆమె మళ్లీ మాట తప్పింది.. 22వ బిడ్డను కంటోంది..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆమె మళ్లీ మాట తప్పింది.. 22వ బిడ్డను కంటోంది.. 

February 29, 2020

Britain woman

‘గంపెడు పిల్లలతో కలకాలం వర్ధిల్లు’ అని వధూవరులను పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కాలం మారిపోయింది. గంపెడు కాదు, గ్లాసెడు అని దీవించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే కొందరు ఇంకా యుగాల వెనకే జీవిస్తుంటారు. బ్రిటన్‌కు చెందిన సూ రాడ్‌ఫోర్డ్ వారిలో ముందుంటుంది. ఆమె తాజాగా 22వ బిడ్డను కంటోంది. నిండు గర్భంతో సెల్ఫీ అంటూ హల్ చల్ చేస్తోంది. 

రాడ్‌ఫోర్డ్ మూడేళ్ల కిందట 21వ బిడ్డను కంటున్నప్పుడు.. తాను ఇకపై గర్భం దాల్చనని చెప్పింది. అయితే ఆ మాట మర్చిపోయి మళ్లీ తల్లికాబోతోంది. 45 ఏళ్ల రాడ్‌ఫోర్డ్ 14వ ఏట తొలి బిడ్డను కన్నది. అప్పట్నుంచి గ్యాప్ లేకుండా కంటూనే ఉంది. మధ్యలో ఒక నెలలు నిండని బిడ్డ పుట్టి చనిపోయాడు. 21 మంది పిల్లలతో కళకళలాడుతుంటుంది రాడ్ ఫోర్డ్‌ల కుటుంబం. 11మంది మగపిల్లలు, 10 మంది ఆడపిల్లలు..  లాంకషైర్ లోని మోర్ కాంబేలో నివసిస్తున్న ఈ కుటుంబం బ్రిటన్లో అతిపెద్ద కుటుంబం. పెద్ద కొడుకు క్రిష్ వయసు 30 ఏళ్లు. ఈ గంపెడు సంతానానికి ఆడుకోవడానికి వేరే ఇరుగుపొరుగు పిల్లలు అక్కర్లేదు. పెద్ద కూతురు సోఫీకి కూడా పెళ్లయి ముగ్గురు పిల్లలు. రాడ్‌ఫోర్డ్‌ల ఇల్లు ఓ చిన్న హాస్టల్లా ఉంటుంది. లీటర్ల కొద్దీ పాలు, పళ్ల రసాలు, డబ్బాల కొద్దీ బ్రెడ్డు, వందలాది గుడ్లు, కేజీల కొద్దీ మాంసం ఎంచక్కా ఆవిరైపోతుంటాయి. ఇంట్లో 10 బెడ్ రూములు ఉన్నాయి. సూ పొద్దున ఆరు గంటలకు లేచి పిల్లల బాగోగులు చూసుకుని రాత్రి 11 గంటలకు పడుకుంటుంది.

ఇంతమంత భారం కదా అని ఎవరైనా అంటే.. ‘భారమేం కాదు. ఇష్టపడి కష్టపడి కంటున్నాం.. నిజానికి 9వసారి గర్భం దాల్చాక నా భర్త వేసక్టమీ ఆపరేషన్ చేయించుకున్నాడు. కానీ మరింతమంది పిల్లలు కావాలని అనుకున్నాం. దీంతో మళ్లీ పిల్లలు పుట్టేలా ఆపరేషన్ చేయించుకున్నాడు. మాకు పిల్లల్ని కనాలనే జబ్బుంది.. ’ అని నవ్వుతూ చెబుతోంది సూ. మరి ఇంత మంది పోషణ ఎలా? ప్రభుత్వం కొంత ఉడతా సాయం చేస్తుంది. మిగిలిన ఖర్చంతా నోయెల్  తాను నడిపే బేకరీలో కష్టపడి సంపాదించేదే..!