ఎఫ్‌బీ ఫోటోలు.. రెండు ప్రాణాలు పోయాయి.. - MicTv.in - Telugu News
mictv telugu

ఎఫ్‌బీ ఫోటోలు.. రెండు ప్రాణాలు పోయాయి..

June 12, 2019

23-year-old commits suicide after her morphed pictures were circulated on social media

చేతిలో సోషల్ మీడియా వుందని కొందరు అందులో ఏం చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు. అలా భావించిన ఓ దుర్మార్గుడు ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొన్నాడు. అమ్మాయి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి నానా రచ్చ చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రియురాలి మరణాన్ని తట్టుకోలేని ఆమె ప్రియుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దారుణం తమిళనాడులో చోటు చేసుకుంది.

కడలూరు జిల్లా నైవేలి సమీపంలోని కురవన్‌ కుప్పంకు చెందిన నీలకంఠం కుమార్తె రాధిక (20) కడలూరులోని ఓ ప్రైవేటు కళాశాలలో పీజీ చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన పన్నీరు కుమారుడు ప్రేమ్‌కుమార్‌ ఆమె మీద కన్నేసాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధించసాగాడు. అక్కడితో ఆగకుండా ఫేస్‌బుక్‌లో కూడా వేధించడం మొదలుపెట్టాడు. రాధిక ఈ విషయాన్ని తన అమ్మానాన్నలకు చెప్పింది. వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ గొడవ కాస్తా రెండు సామాజిక వర్గాలకు అంటుకుంది. ఓ సామాజిక వర్గానికి చెందిన రాజకీయనేతలు, పెద్దల జోక్యంతో ప్రేమ్‌కుమార్‌ను పోలీసులు మందలించి వదిలిపెట్టారు.

ఈ క్రమంలో రాధిక తన మేనత్త కుమారుడు విఘ్నేష్(23) ప్రేమలో పడింది. వారి పెళ్లిని ఇరు వర్గాల పెద్దలు అంగీకరించారు. అయితే వారి ప్రేమను సహించని ప్రేమ్ కుమార్ మరింత కక్ష్య పెంచుకున్నాడు. సమయం కోసం వేచి ఉన్న అతడు కక్ష సాధింపులో భాగంగా రాధిక ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. దీంతో తన పరువు బజారున పడిందని తీవ్రంగా కలత చెందిన రాధిక సోమవారం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాధిక మరణవార్తను విన్న విఘ్నేష్ మానసికంగా బాగా కృంగిపోయాడు. రాధిక లేని జీవితం వద్దు అనుకున్నాడు. సెంగం పాళయం వద్ద ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

ప్రేమ్‌కుమార్‌ పెట్టిన పోస్టింగ్‌ల కారణంగా రాధికా, విఘ్నేష్‌ ఆత్మహత్య చేసుకోవడం ఆ సామాజిక వర్గంలో ఆగ్రహాన్ని రేపింది. దీంతో ప్రేమ్ కుమార్ ఇంటిమీద దాడికి పాల్పడ్డారు. వాహనాలను ధ్వంసం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కడలూరు జిల్లా యంత్రాంగం బలగాల్ని రంగంలోకి దించాల్సి వచ్చింది. పరారీలో వున్న ప్రేమ్ కుమార్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కోర్టులో ప్రేమ్‌కుమార్‌ లొంగిపోయాడు. దీంతో  ఇద్దరి మృతదేహాల్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆ గ్రామంలో పరిస్థితి మరలా అదుపు తప్పకుండా పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. ఇద్దరి చావుకు కారణమైన ప్రేమ్‌కుమార్‌ను కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు కోరుతున్నారు.