ముంబైకి చెందిన 23 యేండ్ల అక్షయ్ రిడ్లాన్ క్యూఆర్ కోడ్ ను అభివృద్ధి చేశాడు. ముఖ్యంగా ఇది పెంపుడు జంతువులు తప్పిపోయినప్పుడు ఈజీగా కనిపెట్టేందుకు ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది.
జంతు ప్రేమికుల్లో మీరు ఉన్నారా? మీ పెట్ తప్పిపోతే మీ బాధను ఎవరూ తగ్గించలేరు. ఇలాంటి వారికోసం ఒక ఇంజినీర్ ఆలోచన చేశాడు. జంతువులకు సంబంధించి ఇదొక ఆధార్ కార్డ్ లా పనిచేయాలని అక్షయ్ భావించాడు. దీన్ని స్కాన్ చేస్తే ట్యాగ్ చేయబడిన జంతువు గురించిన సమాచారం వచ్చేస్తుందట. ఇది కేవలం కమ్యూనిటీ జంతువులకు మాత్రమే పని చేస్తుందంటున్నాడు.
ప్రేరణ ఎలా..
పెంపుడు జంతువు కంటే సహచరులు ఎవరూ ఉండరని నమ్మేవాళ్లు ఎక్కువ మందే ఉన్నారు. అక్షయ్ కూడా ఇందులో మొదటగా ఉంటాడు. తనకు ఇంతో ఇష్టమైన కుక్క కాలూ ఉండేది. మే 2020లో ఇంటి దగ్గర ఎవరో బాణసంచా కాల్చారు. ఆ శబ్దాలకు కాలూ ఎక్కడికో వెళ్లిపోయింది. తిరిగిరాలేదు. దీంతో అక్షయ్ ఆలోచనలో పడ్డాడు. పెంపుడు జంతువు కోల్పోయిన బాధ వర్ణనాతీతం అంటున్నాడు. ఈ క్యూఆర్ కోడ్ ను ఏ జంతువుకైనా ఉపయోగించవచ్చు. ఈ డేటాను ప్రభుత్వం యాక్సెస్ చేయడానికి అనుమతినిస్తే బాగుంటుందని భావిస్తున్నాడు. దీనివల్ల పెట్స్ కి ఇది డిజిటల్ ఆధార్ కార్డ్ గా పనిచేస్తుంది. అంతేకాదు.. వైద్య, వ్యక్తిగత, కేర్ టేకర్ల సమాచారాన్ని కూడా సులభంగా ఈ కోడ్ ద్వారా ట్రాక్ చేయవచ్చని అక్షయ్ అంటున్నాడు.
విదేశాల్లో సైతం..
అక్షయ్ తన ఇన్నోవేషన్ ని విదేశాల్లో సైతం అమలు చేయాలని భావిస్తున్నాడు. పశ్చిమదేశాల్లో.. పెంపెడు జంతువుల నమోదు తప్పనిసరి. కాబట్టి అక్కడ ఇది మరింత బాగా ఉపయోగపడుతుందని అతను అనుకుంటున్నాడు. దీనికోసం ఎవరైనా కావాలనుకుంటే pawfriend.in కు వెళ్లి ఫామ్ నింపేయండి. అభ్యర్థనను ప్రాసెస్ చేసి వారి బృందంలోని వారు కాల్ ద్వారా మీకు వివరాలు తెలియచేస్తారు. ప్రస్తుతానికి క్యూఆర్ కోడ్ సాఫ్ట్ కాపీ ఉచితంగా ఇస్తున్నారు. డేటా పెరిగే కొద్దీ నామమాత్రపు ఛార్జ్ ఉంటుందని అక్షయ్ తెలిపాడు.