రెండు మూడు రకాల ఉద్యోగాలు మారాలంటే మనకు చాలా భయమేస్తుంది. అలాంటిది 23 ఏళ్ల యువతి ఏకంగా 23 ఉద్యోగాలు మారింది. అంతటా అనుభవం సంపాదించి ఏకంగా కంపెనీ పెట్టేసి సీఈవో అయిపోయింది. ఈమెది ప్రపంచంలోనే అతి పొడవైన రెజ్యూమ్గా జనాలు చెప్పుకుంటున్నారు. 16 ఏళ్ల వయసులో ఉద్యోగంలో జాయినై, ఏడేళ్లలో అన్ని ఉద్యోగాలు మారడమంటే ఒక రకంగా వింతే అని చెప్పుకోవచ్చు. లండన్‌కు చెందిన అనస్తీసియా సెచెట్టో అనే యువతి 16 ఏళ్ల వయసులో బేకర్‌గా జాయినయింది.
అయితే అది కష్టంగా ఉండడం, చాలా సేపు ఫ్రీజర్‌లో నిలబడాల్సి రావడంతో మానేసింది. తర్వాత డిష్ వాషర్, వెయిట్రస్, సేల్స్ వుమెన్, పియానో టీచర్, మార్కెట్ సెల్లర్, ఐస్ క్రీం సెల్లర్, రిటైల్ వర్కర్, బేబీ సిట్టర్, నటన, మోడలింగ్, కంటెంట్ రైటింగ్, ఫోటోగ్రఫీ వంటి 23 ఉద్యోగాలు చేసింది. చివరికి ప్రస్తుతం 23 ఏళ్ల వయసులో కంపెనీ పెట్టి సీఈవోగా మారింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. ‘చివరగా ఓ లగ్జరీ హోటల్‌కి క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేశాను. అది మంచిదే కానీ, ఒకరి కింద పనిచేయడం నాకు నచ్చదు. స్వంతంగా ఏదైనా సాధించాలనే కోరిక చిన్నప్పటి నుంచి బలంగా ఉండేది. అందుకే అన్ని రకాల పనులు చేసి అనుభవం సంపాదించాను. అన్ని ఉద్యోగాల నుంచి నా అంతట నేనే బయటకు వచ్చాను. ఎవరూ నన్ను తీసేయలేదు. అయితే, డిష్ వాషర్, వెయిట్రస్లను గౌరవించాలని అదనంగా నేర్చుకున్నాను. ఎవ్వరి పని అయినా మనం గౌరవించాలని అర్ధం చేసుకున్నా’నని వివరించింది.