ఒకప్పుడు హార్ట్ అటాక్ అంటే కాస్త వయసుపైబడిన వారికే వస్తాయని భావించేవారు. కానీ తాజా అధ్యయనాల ప్రకారం 50 ఏళ్లలోపు యువకులు హార్ట్ ఎటాక్‌లకు గురవుతున్న సంఘటలను తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయి. అందులోనూ ఫుల్ ఫిట్‌గా ఉండే కండలవీరులు సైతం జిమ్ వర్కౌట్స్ చేస్తూనే వ్యాయామశాలల్లో గుండెపోటుకు గురై కుప్పకూలీపోతున్నారు. దేశంలో ఇలాంటి సంఘటనలు ఈ మధ్య చాలానే జరుగుతున్నాయి. అసలు మూడు పదులు వయసు కూడా దాటని యువకులకు గుండెపోటు ఎందుకు వస్తోంది అన్న కలవరం ఇప్పుడు సర్వత్రా నెలకొంది. తాజాగా ఇలాంటి ఘటనే మహబూబ్‌నగర్ జిల్లాలోనూ చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే..మహబూబ్‌నగర్ పట్టణ ప్రాంతంలోని రామయ్యబౌలికి చెందిన జున్నుగా పిలవబడే 23 ఏళ్ల మాజిద్ హుస్సేన్ షోయబ్ రోజూవారి వేతన పనులకు వెళ్లేవాడు. తన పనులన్నింటిని పూర్తి చేసుకున్న తరువాత జున్న ప్రతి రోజూ జిమ్ముకు వెళ్లేవాడు. అదే విధంగా గురువారం రాత్రి న్యూటౌన్ ప్రాంతంలో ఉన్న ఓ జిమ్‌కు వెళ్లాడు. అక్కడే కాసేప వర్కౌట్స్ చేశాడు. తరువాత రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగివచ్చాడు. అప్పటివరకు మామూలుగానే ఉన్న జున్నుకు ఒక్కసారిగా ఛాతిలో నొప్పి వచ్చింది. ఆ తరువాత వాంతులు చేసుకున్నాడు. తిన్నది అరగక ఇలా ఉందేమోనని లైట్ తీసుకున్నాడు. ఇంటి ముందు వాకింగ్ చేయడం ప్రారంభించాడు. అయితే హటాత్తుగా తీవ్రమైన గుండెనొప్పితో ఒక్కసారిగా ఇంటి ముందే కుప్పకూలిపోయాడు. జున్ను పడిపోవడాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతడిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే జున్ను అప్పటికే మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్న వయసులోనే ఎంతో ఫిట్‌గా ఉండే తన కుమారుడు ఇలా చనిపోవడంతో కుటుంబ సభ్యులను కలచివేసింది.