వడ్డే నవీన్ ‘పెళ్లి’కి పాతికేళ్లు
హిట్ చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో 1997 ఆగస్టు 8న విడుదలైన చిత్రం పెళ్లి. వడ్డే నవీన్, మహేశ్వరి, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలతో.. ఎన్. రామలింగేశ్వరరావు నిర్మించిన ఈ సినిమా నేటితో పాతికేళ్లు పూర్తిచేసుకుంది. కోడలి భవిష్యత్ కోసం ఓ అత్త.. కన్న ప్రేమను కూడా చంపుకోవడమే కథాంశంగా శ్రీరామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా అప్పట్లో సూపర్ డూపర్ హిట్. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది.
వడ్డే నవీన్ కెరీర్లోనే ‘పెళ్లి’ బిగ్గెస్ట్ హిట్. సుజాత, గిరిబాబు, బ్రహ్మానందం, మల్లికార్జునరావు, అనంత్, అశోక్ కుమార్, కోవై సరళ, వై.విజయ, జయలలిత నటించిన ఈ చిత్రంలో పృథ్వీరాజ్ ను నూతన పరిచయంగా టైటిల్స్ లో ప్రకటించారు. హీరోయిన్ మహేశ్వరికి ఈ సినిమాతో మంచి పేరొచ్చింది. శ్రీనివాస చక్రవర్తి అందించిన కథకు, జి.సత్యమూర్తి మాటలు పలికించారు. ఎస్.ఏ.రాజ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన ఈ సినిమాలో ప్రతి పాట సూపర్ హిట్టే. 'ఓ యవ్వన వీణా', 'రుక్కు రుక్కు రుక్కు రుక్మిణి', 'జాబిలమ్మ నీకు అంత కోపమా', 'అనురాగమే మంత్రంగా', 'పైటకొంగు ఎంతోమంచిది', 'కొండాకోన గుండెల్లో ఊగే ఉయ్యాల' అంటూ సాగే పాటలు ఆకట్టుకున్నాయి.
వడ్డే నవీన్ ఆ తర్వాత నా హృదయంలో నిదురించే చెలీ, ప్రేమించే మనసు, బాగున్నారా లాంటి సూపర్హిట్ సినిమాలతో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. 2016లో అటాక్ చిత్రంతో చివరిసారిగా కనిపించిన ఆయన.. నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అనేక సినిమాలకు పనిచేశారు. అయితే ఈ మధ్య కాలంలో కనిపించడమే మానేశారు.