ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని రోజులుగా కొత్త జిల్లాల ఏర్పాటుపై అధికార పార్టీ నాయకుల మధ్య ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం తెలిసిందే. తమ జిల్లాలోని ఫలనా ప్రాంతాన్ని కొత్త జిల్లా చేయండి అంటూ ప్రజలు, పలు పార్టీ కార్యకర్తలు ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలో
సోమవారం సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. 13 జిల్లాలుగా ఉన్న ఏపీ ఇకనుంచి 26 జిల్లాలుగా ఏర్పడింది. ఈ మేరకు నూతన జిల్లాల ప్రారంభోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించింది. అనంతరం జగన్ ఎలక్ట్రానిక్ బటన్ నొక్కడంతో ఏపీ వ్యాప్తంగా నూతన జిల్లాల ఉనికి అమల్లోకి వచ్చింది.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ఆయా జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొన్నారు. జగన్ మాట్లాడుతూ “ఇవాళ మంచి పనికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ప్రజలకు మంచి జరిగే గొప్ప రోజు ఇది. 26 జిల్లాల ఆంధ్ర రాష్ట్రంగా రూపుమారింది. గతంలో ఉన్న జిల్లా పేర్లు అలాగే ఉన్నాయి. ఆ 18 జిల్లా కేంద్రాలను అలాగే కాపాడుకున్నాం. పరిపాలనా సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరం మేరకే కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. ప్రజలకు పరిపాలన మరింత చేరువ కావాలనే మార్పులు చేశాం. కలెక్టర్లకు అధికారంతో పాటు ప్రజల పట్ల బాధ్యత పెరిగింది. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు అవసరం” అని జగన్ అన్నారు.