దేశంలో నిరుద్యోగం ఎంత తీవ్రంగా ఉందో అంతే తీవ్రంగా వారిని మోసం చేసే సంఘటనలు జరుగుతున్నాయి. అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని డబ్బులు వసూలు చేసి వారిని ఘోరంగా మోసపుచ్చుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది కదా అనే ఆశతో నిట్టనిలువునా దోపిడీకి గురవుతున్నారు. ఇందులో ఐటీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్ధులు కూడా ఉండడం గమనార్హం. తమిళనాడులో రైల్వే ఉద్యోగాల పేరుతో 28 మంది దారుణంగా మోసపోయారు. స్టేషనులో వచ్చీ పోయే రైళ్లు, వాటి బోగీలను లెక్కించడమే మీ ఉద్యోగం అని చెప్పినప్పుడు వారికి ఏ మాత్రం అనుమానం రాలేదు. నిజంగానే నెల రోజులు ఆ పని చేశారు. తర్వాత జీతం కోసం వెయిట్ చేయగా, రాకపోవడంతో అప్పుడు వారికి జ్ఞానోదయం అయింది. తమిళనాడుకు చెందిన 28 మంది యువకులు రైల్వేలో ఉద్యోగం కోసం రూ. 2 లక్షల నుంచి 24 లక్షల వరకు కేటుగాళ్లైన రాణా, శివరామన్ లకు ముట్టజెప్పారు. వీరిలో రాణా తనను తాను ఢిల్లీలోని నార్త్ రైల్వే కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ గా పరిచయం చేసుకున్నాడు. ఢిల్లీ రైల్వే స్టేషనులో ప్రతీరోజు వచ్చే రైళ్లను లెక్కించమని చెప్పగా వారు అలాగే చేశారు. ఆ సమయంలో ఎవరైనా అనుమానం వచ్చి అడిగితే టీటీఈ, ట్రాఫిక్ అసిస్టెంట్లు, క్లర్క్ ఉద్యోగుల శిక్షణలో ఇది ఒక భాగమని నమ్మించేవారు. నెల గడిచిన తర్వాత అకౌంటులో జీతం డబ్బులు పడకపోవడంతో మధ్యవర్తిగా వ్యవహరించిన 78 ఏళ్ల మాజీ సైనిక ఉద్యోగిని నిలదీశారు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా, బ్యాక్ డోర్ ఉద్యోగాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, డబ్బులిచ్చి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.