28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు.. వీడు మనిషేనా! - MicTv.in - Telugu News
mictv telugu

28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు.. వీడు మనిషేనా!

October 1, 2022

ఒక్క పెళ్లికే దిక్కులేని పెళ్లి కాని ప్రసాదులు కోకొల్లలుగా ఉన్న మన దేశంలో ఓ ప్రబుద్ధుడు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. అదో గొప్ప అయితే, ఈ ఘనకార్యమంతా కేవలం 28 ఏళ్ల వయసుకే పూర్తి చేశాడు. విడాకులు, భార్యలు వేరే వాళ్లతో వెళ్లిపోవడం, మరేవైనా సమస్యలో దీనికి కారణం అనుకుంటే పొరపాటు. పోనీ, బాగా డబ్బుందేమో అనుకుంటే అదీ పొరపాటే. ఇన్ని పెళ్లిళ్లు చట్టవిరుద్ధం కదా అంటే అది కరెక్టే. పెళ్లిపై పెళ్లి చేసుకుని మోసం చేసి పారిపోవడమే అతని గుణం.

పశ్చిమ బెంగాల్‌కు చెందిన అసబుల్ మొల్లా అనే యువకుడు ఆ రాష్ట్రంలోనే కాకుండా పక్కనున్న బిహార్‌లోనూ పెళ్లిళ్ల బాగోతానికి తెరలేపాడు. డ్రైవర్ అని, అడ్డా కూలీ అని మారు పేర్లు, మారు వృత్తులు చెప్పుకుని, నకిలీ ఆధార్, ఐడీ కార్డులు సంపాదించాడు. వాటిని అడ్డుపెట్టుకుని అమాయకమైన ఆడపిల్లలను వల్లో వేసుకోవడం, పెళ్ల చేసుకుని, డబ్బులు, నగలు ఎత్తుకెళ్లడం అతని పని. ఇటీవల బెంగాల్లోని సాగర్ దిగీ ప్రాంతానికి చెందిన ఓ యువతిని అలాగే ముగ్గులోకి దింపి నగలు తీసుకుని పారిపోయాడు. ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో బండారం బయటపడింది. అసబుల్ చేతిలో మోసపోయిన యువతులు ఒకరొకరే బయటికొచ్చి గోడు వెళ్లబోసుకుంటున్నారు. ముఖపరిచయంతో పెళ్లి చేసుకుంటామని వస్తే బుట్టలో పడిపోకుండా, మంచీ చెడ్డా, ఊరూ పేరూ, బంధువులు వగైరా విషయాలను పూర్తిగా తెలుసుకున్నాకే పెళ్లి చేసుకోవాలని పోలీసులు హెచ్చరించారు.