నగరంలో ఇటీవలే నెక్లెస్ రోడ్డు మీద అంతర్జాతీయ స్థాయిలో కార్ల రేసింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. దేశంలోనే మొదటిసారి హైదరాబాదులో ఈ పోటీలను నిర్వహించి ప్రభుత్వం తన ప్రతిష్టను పెంచుకుంది. అయితే రేసింగ్ కోసం ఏర్పడిన ట్రాఫిక్ సమస్య వల్ల సామాన్యులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నగర శివారులో నిర్వహించకుండా నడిబొడ్డున కార్ల రేసింగ్ ఏంటని విమర్శలు వినిపించాయి. ఏది ఏమైనా రేసింగ్ విజయవంతంగా జరగింది. అయితే దాన్ని స్పూర్తిగా తీసుకున్నారో ఏమో కానీ నగరానికి చెందిన ఓ బిజినెస్ స్కూలుకు చెందిన విద్యార్ధులు మూడు కార్లతో రేసింగ్ పెట్టుకున్నారు. వారి రేసింగ్ దాహానికి ఓ మహిళలను బలి తీసుకున్నారు. శంకర్ పల్లి మండలం జన్వాడ గ్రామానికి చెందిన దంపతులు నర్సింహులు, శాంతమ్మలు మంగళవారం సాయంత్రం బైకుపై శంకర్ పల్లి నుంచి తిరిగి వస్తుండగా మీర్జాగూడ కొల్లూరు గేటు సమీపంలో రేస్ కారు ఢీకొట్టింది. దీంతో దంపతులు కింద పడిపోగా వెనుకనుంచి వచ్చిన మరో కారు శాంతమ్మపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ నర్సింహులును ఆస్పత్రికి తరలించిన స్థానికులు కారు నడిపిన సుజీత్ రెడ్డిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులు వచ్చి రెండు కార్లను స్వాధీనం చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే సుజిత్ రెడ్డి మద్యం తాగలేదని పరీక్షల్లో వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.