సినిమాలు మస్తు ఆడుతోన్నాయి, ఆర్థిక మాంద్యం లేదు..కేంద్రమంత్రి - MicTv.in - Telugu News
mictv telugu

సినిమాలు మస్తు ఆడుతోన్నాయి, ఆర్థిక మాంద్యం లేదు..కేంద్రమంత్రి

October 13, 2019

ఆర్థికమాంద్యం గురించి కేంద్రమంత్రి రవి శంకర్ ప్రసాద్ మాట్లాడినతీరు వివాదాస్పదం అవుతోంది. శనివారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో సినిమా కలెక్షన్లకు, ఆర్థిక మాంద్యానికి ముడిపెట్టారు. అక్టోబర్‌ 2న మూడు సినిమాలు విడుదలైన రూ.120 కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఇక దేశంలో ఆర్ధిక మాంద్యం ఎక్కడుందని ప్రశ్నించారు. 

దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉందనడానికి ఈ ఉదాహరణ సరిపోతుందన్నారు. అక్టోబర్‌ 2న తెలుగు సినిమా ‘సైరా’, హిందీ సినిమా ‘వార్‌’, ఇంగ్లీష్ సినిమా ‘జోకర్‌’.. మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కలిపి రూ.120 కోట్లపైనే వసూళ్లు రాబట్టాయి. రవిశంకర్ ప్రసాద్‌ను ఆర్ధికమాంద్యం గురించి ప్రశ్నించిన విలేకరులకు ఈ కలెక్షన్ల లెక్కలు చెబుతూ దేశంలో సంక్షోభాలు లేవని సుభిక్షంగానే ఉందన్నారు. కాగా, రవి శంకర్ ప్రసాద్ వ్యాఖ్యలపై నెటిజన్లు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. గతవారం ఆ మూడు సినిమాలు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడాయి.. ఈ వారం ఏ సినిమాలు దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుతాయా అని కామెంట్స్ చేస్తున్నారు.