3 held, 2 wardens sacked over Chandigarh University leaked videos
mictv telugu

ప్రైవేట్ వీడియోలు లీకైన కేసులో ఇద్దరు అరెస్ట్… ఆందోళన విరమణ

September 19, 2022

పంజాబ్‌లోని చండీగఢ్‌ ప్రైవేటు యూనివర్సిటీలో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. సిమ్లాకు చెందిన సన్నీ మెహతా(23), రాంకజ్ వర్మ(31) అనే ఇద్దరు నిందితులను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని.. అనంతరం వారిని పంజాబ్ పోలీసులకు అప్పగించారు.

చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థినిల ప్రైవేట్ వీడియోలు లీక్ చేసిన కేసులో అరెస్టైన నిందితురాలికి సన్నీ మెహతా ప్రియుడు. సన్నీ.. శిమ్లాలోని రోహ్రు నివాసి. అతడు బీఏ వరకు చదివాడు. ప్రస్తుతం తన సోదరుడితో కలిసి ఓ కేక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మరో నిందితుడు రాంకజ్ వర్మ.. శిమ్లాలోని థియోగ్ నివాసి. అతడు ఓ ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్నాడు. వీరిద్దరి వద్ద ఆ లీక్ వీడియోలు ఉన్న ఆధారాలతో పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ వెల్లడించారు.

మరోవైపు చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థులు తమ నిరసనలను సోమవారం తెల్లవారుజామున విరమించారు. అధికారులు, పోలీసులు పారదర్శకంగా దర్యాప్తు చేస్తామని హామీ ఇవ్వడం వల్ల ఆందోళనలు నిలిపివేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించింనందుకు ఇద్దరు వార్డెన్లను సస్పెండ్ చేశారు వర్సిటీ అధికారులు.