3 held with ‘huge amount of cash’, police say bid to poach TRS MLAs
mictv telugu

BJP తరఫున స్వామీజీల బేరసారాలు.. c/o TRS ఎమ్మెల్యే ఫాం హౌస్

October 27, 2022

 

మునుగోడు ఉపఎన్నిక వేళ .. తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం సంచలనం సృష్టించింది. టీఆర్ఎస్ పార్టీ ఫిరాయించేలా నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారంటూ ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపింది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేసిన బీజేపీ ఆపరేషన్ బెడిసికొట్టింది. హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్‌లో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన ఈ గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు వల వేస్తూ.. వారితో బేరసారాలు నిర్వహిస్తుండగా పోలీసులు ఎంట్రీ ఇచ్చి చెక్ పెట్టారు. ఎమ్మెల్యేలతో బేరం జరుపుతుండగా పోలీసులు బిగ్ షాక్ ఇచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఏం చెప్పారంటే…

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. ఉత్తర కాశీలోని కపిలాశ్రమానికి రామచంద్రభారతి వారితో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ సమాచారం ఇచ్చారు. డబ్బులు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని చెప్పారన్నారు. ఫాం హౌస్ లో రైడ్ చేస్తే ముగ్గురు పట్టుబడ్డారు. రామచంద్రభారతి ఢిల్లీలో వుంటారు. తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజులు వచ్చారు. హైదరాబాద్ కి చెందిన నందకుమార్ S/o శంకరప్ప టీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపుల కోసం నలుగురు ఎమ్మెల్యేలను ఒత్తిడి, ప్రలోభాలు పెట్టారన్నారు.

అసలు జరిగింది ఇది..

బీజేపీ నేతలు తమకు మొదటి నుంచి ప్రలోభాలకి గురి చేస్తున్నారని, ఆఫర్లు ఇస్తామని చెప్పినట్టు నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీఆర్‌ఎస్‌ అగ్రనేతలకు సమాచారమిచ్చారు. పక్కా ప్లాన్‌తో బీజేపీ నేతలను తాము పార్టీ మారుతామంటూ నమ్మించారు. ఇక బీజేపీ నేతలు ముందు జాగ్రత్తగా, తాము నేరుగా రంగంలోకి దిగకుండా స్వామీజీలకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఒకరిద్దరు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌ మాట్లాడుతూ వచ్చారు. ముందే వేసుకున్న ప్లాన్‌లో భాగంగా… అజీజ్‌నగర్‌లో తనకు ఫామ్‌హౌజ్‌ ఉన్నదనీ, అక్కడ కలుద్దామని పైలట్‌ రోహిత్‌రెడ్డి వారిని నమ్మించారు. అనుకున్నట్టే బుధవారం సాయంత్రం నలుగురు ఎమ్మెల్యేలూ, నందు మొయినాబాద్‌లోని ప్రైవేట్‌ ఫామ్‌హౌస్‌కు చేరుకొన్నారు.

ఇక రామచంద్ర భారతి ఢిల్లీ నుంచి విమానంలో హైదరాబాద్‌ వచ్చి, నేరుగా ఫామ్‌హౌజ్‌కు చేరుకోగా, సింహయాజి తిరుపతి నుంచి వచ్చారు. ‘ఎమ్మెల్యేలు ఒక్కొక్కరికి 100 కోట్లు అందిస్తాం. ఏ రాష్ట్రంలో కావాలంటే ఆ రాష్ట్రంలో కాంట్రాక్టులు ఇస్తాం. మీకు ఏ పదవి కావాలో అది ఇప్పిస్తాం’ అని వారు ఆఫర్‌ చేశారు. ఎమ్మెల్యేలు వీటికి అంగీకరిస్తున్నట్టుగా నటిస్తూ చర్చను పొడిగించారు. ‘మీరు ఎలాగూ చేరుతున్నారు. అడ్వాన్స్‌గా నగదు తీసుకోండి. ఆ బ్యాగుల్లో క్యాష్‌ ఉంది. లెక్కపెట్టుకోండి’ అని కూడా స్వామీజీలు ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగం ప్రవేశం చేసి కుట్రను బట్టబయలు చేసారు.

పోలీసులు ఫామ్‌లోకి ప్రవేశించగానే.. స్వామీజీలు కంగారుపడి.. ‘పోలీసులకు ఇక్కడ ఏం పని? మీరెందుకు వచ్చారు? మీరెలా సోదాలు చేస్తారు’ అని వారిలో ఒకరు గట్టిగా అరిచారు.

‘పోలీసులకు ఏం పని అడగడానికి ఆయన ఎవరు? మాకు అన్ని చోట్లా పని ఉంటుంది. ఢిల్లీకి చెందిన ఆయనకు ఇక్కడేం పని అని కనుక్కోవడానికి మేం వెళ్లాం’ అని ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఒక అధికారి ఆ తర్వాత నవ్వుతూ చెప్పారు.

అసలు స్వామీజీలు ఏ పని మీద ఫాంహౌస్ కి వచ్చారు? అక్కడ అంత మొత్తంలో డబ్బు ఎందుకు ఉంది? ఈ విషయాలపై పోలీసులు ఆ ముగ్గురిని చాలాసేపు గట్టిగానే ప్రశ్నించారు.

ఆ ఇంటరాగేషన్‌లో స్వామీజీలు అనేక కీలక విషయాలు బయటపెట్టారని సమాచారం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలను బీజేపీ ఎలా కూలగొట్టిందో త్వరలో అదే విధంగా ఢిల్లీ, రాజస్థాన్‌ ప్రభుత్వాలు కూడా పతనం కాబోతున్నాయని వారు చెప్పినట్టు భోగట్టా. ఇదంతా పోలీసులు వీడియో రికార్డు చేశారు. ఇందులో అనేక కీలక సంచలనాత్మక విషయాలున్నట్టు చెప్తున్నారు. ఈ కేసులో బీజేపీ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిందని పోలీసులు పేర్కొన్నారు.