సరిహద్దుల్లో పాక్ ఉగ్రవాదులు దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. డ్రోన్లద్వారా కశ్మీర్లోకి పేలుడు పదార్థాలను అక్రమంగా సరఫరా చేస్తున్నారు. సరిహద్దుల్లో అలాంటి ఓ డ్రోన్‌ను గుర్తించి కాల్పులు జరిపారు జమ్మూ పోలీసులు. డ్రోన్ నుంచి జారవిడిచిన మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీ బాంబులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అఖ్నూర్ సెక్టార్‌లోని భారత్ – పాకిస్థాన్ సరిహద్దు వద్ద రాత్రి 11 గంటల ప్రాంతంలో కనచక్‌లో డ్రోన్ కన్పించింది. వెంటనే భద్రతా సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే డ్రోన్‌లో ఉన్న పేలోడ్ కిందపడగా.. డ్రోన్ మాత్రం తప్పించుకున్నట్లు జమ్మూ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. డ్రోన్ నుంచి జారిపడిన పేలోడ్‌లో టిఫిన్ బాక్సుల్లో ఉన్న మూడు మ్యాగ్నెటిక్ ఐఈడీలను పోలీసులు గుర్తించారు. వాటికి టైమర్ కూడా సెట్ చేసి ఉంచినట్లు తెలిపారు. బాంబులను నిర్వీర్యం చేసి ఘటనపై కేసు నమోదు చేశామని ముకేశ్ సింగ్ తెలిపారు. డ్రోన్ జారవిడిచిన 3 మ్యాగ్నెటిక్ ఐఈడీలను కంటోవాలా- దయారన్ ప్రాంతంలో గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.