అధిక కొవ్వు.. ‘సైలెంట్ కిల్లర్’ అని కూడా దీనికి పేరు. సకాలంలో రోగనిర్ధారణ చేయకపోతే తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ముందు నుంచే యోగాసనాలు చేయడం ద్వారా అధిక కొవ్వు చేరకుండా ఉంటుంది.
చెడు కొలెస్ట్రాల్ ప్రారంభంలో తెలియదు. ఆరోగ్యం క్షీణించిన తర్వాత మాత్రమే పరిస్థితి గుర్తించగలుగుతాం. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల దీన్ని సులభంగా తగ్గించవచ్చు. చెడు కొలెస్ట్రాల్ తగ్గి.. మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెంచడానికి ఈ మూడు శక్తివంతమైన యోగాసనాలు రోజూ చేయండి. ఆరోగ్యవంతులు అవ్వండి.
సర్వాంగసనం
అధిక కొలెస్ట్రాల్ ని తగ్గించే ఆసనాల్లో ఇది అత్యుత్తమ ఆసనం. హానికరమైన కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో ఈ ఆసనం సహాయపడుతుంది.
ఎలా చేయాలి? : ముందు వెల్లకిలా పడుకోవాలి. ఆ తర్వాత కాళ్లను నెమ్మదిగా వీలైనంత వరకు పైకి లేపాలి. తల కిందకు ఉండేలా, భుజాల మీద బరువు ఆగేలా.. నడుము, కాళ్లు బ్యాలెన్స్ చేస్తూ మొత్తంగా పైకి లేవాలి. ముందు కొన్ని రోజులు గోడను ఆనుకొని చేసి చూడండి.
థైరాయిడ్, గుండె, హెర్నియా సమస్యలతో బాధపడుతున్న వారు ఈ ఆసనం చేయకూడదు.
కపాలభాతి ప్రాణాయామం :
ఈ ఆసనం ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది.
ఎలా చేయాలి ? : నిటారుగా కూర్చోండి. లోతైన శ్వాస తీసుకోండి. ఆ తర్వాత మెల్లగా వదులండి. ఇలా చేస్తున్నప్పుడు పొట్ట లోపలికి, బయటకి రావాలి. దీన్ని నిరంతరం చేయడం వల్ల సోమరితనం కూడా తగ్గుతుంది.
మైగ్రేన్ సమస్య ఉన్నవారు, గర్భవతులు, రుతుస్రావ సమయంలో ఈ ప్రాణాయామానికి దూరంగా ఉండాలి.
పశ్చిమోత్తసనం :
ఈ భంగిమ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది.
ఎలా చేయాలి? : కాళ్లు చాచుకొని కూర్చోవాలి. ఇప్పుడు మీ తలను పాదాల వద్దకు చేర్చండి. శ్వాస నెమ్మదిగా తీసుకోవాలి. ముక్కు మోకాళ్లను తాకే వరకు నెమ్మదిగా వంగండి.
గర్భవతులు ఈ ఆసనానికి దూరంగా ఉండాలి.