3 Telangana civic employees suspended for no-show at minister KTR's 'birthday bash'
mictv telugu

కేటీఆర్ బర్త్ డే వేడుకలకు రాలేదని మున్సిపల్ సిబ్బందికి నోటీసులు

July 29, 2022

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనలేదంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటికి చెందిన ముగ్గురు ఉద్యోగులకు మున్సిపల్ కమీషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేసిన వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ నెల 24న మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావాలని మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి వాట్సాప్ మెసేజ్ పంపారు అధికారులు. అయితే కార్యాలయానికి చెందిన ముగ్గురు ఉద్యోగులు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. దీంతో పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిలో భాగంగా టి.రాజేశ్వరి (సీనియర్ అసిస్టెంట్), పున్నం చందర్ (జూనియర్ అసిస్టెంట్), మోహన్ (సిస్టమ్ మేనేజర్)లకు మెమోలు జారీ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

అటు ఈ వ్యవహారంపై ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జి సునీల్ దేవధర్ మండిపడ్డారు. ట్విట్టర్ లో కేసీఆర్ కుటుంబం పెంచిపోషిస్తున్న రాచరికపు పోకడలు తెలంగాణలో మరో స్థాయికి చేరాయని విమర్శించారు. ఇలాంటి ఘటనల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని తెలిపారు. అంతేకాదు, సదరు ఉద్యోగులకు బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన మెమోను కూడా సునీల్ దేవధర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

అయితే మంత్రి కేటీఆర్.. ఈసారి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు.