ఆ ఊరంతా పోలీసులే.. ఇప్పటి వరకు 600 మంది ఎంపిక - MicTv.in - Telugu News
mictv telugu

ఆ ఊరంతా పోలీసులే.. ఇప్పటి వరకు 600 మంది ఎంపిక

September 26, 2019

ఏదైనా ఊరి నుంచి పోలీసుల ఉద్యోగం సాధించారంటే పదుల సంఖ్యలో ఉంటారని భావిస్తాం. కానీ రంగారెడ్డి జిల్లా ఆలూరు గ్రామంలో మాత్రం ఏకంగా 600 మంది వరకు పోలీసు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నవారు ఉన్నారు. పోలీసు పరీక్ష ఫలితాలు ప్రకటించిన ప్రతిసారి పదుల సంఖ్యలో ఈ గ్రామం నుంచి ఎంపిక అవుతూ ఉంటారు. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో కూడా మొత్తం 30 మంది యువకులు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఇక్కడ మరో విశేషం ఏంటంటే 8 మంది యువతులు కూడా ఎంపికైనవారిలో ఉన్నారు.

Police

 

రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఆలూరుకు చెందిన కానిస్టేబుళ్లు కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఇంటి నుంచి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఇక్కడ ఉన్నారంటూ అతిశయోక్తికాదు. ఒకరిని చూసి మరొకరు ప్రేరణ పొందండం, ఉద్యోగం సాధించినవారు అభ్యర్థులకు మెలకువలు నేర్పించడం వల్లే ఇది సాధ్యమౌతుందని చెబుతున్నారు. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన వారు అంతటితో ఆగిపోవడంలేదు. ఉన్నత పదవుల కోసం పోటీ పరీక్షలు రాస్తూనే ఉన్నారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తల్లాడ మండలంలోని మల్లారం గ్రామ యువత కూడా ఫలితాల్లో సత్తా చాటారు.  ఒకే గ్రామం నుంచి 17 మంది కానిస్టేబుల్​ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పట్టుదల, కృషి ఉంటే సాధించనిదంటూ ఏదీ ఉండదని వీళ్లు రుజువు చేశారు.