తెలంగాణలో 309 శాతం పెరిగిన బస్సు ఛార్జీలు.. షాక్‌లో విద్యార్థులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో 309 శాతం పెరిగిన బస్సు ఛార్జీలు.. షాక్‌లో విద్యార్థులు

June 11, 2022

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ ఆర్టీసీ టికెట్ల రేట్లను ఏకంగా మూడు రెట్లు (309 శాతం) పెంచేసింది. పెరిగిన ఛార్జీలతో ప్రజలు, విద్యార్థులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. బస్సు ప్రయాణం చేయాలంటేనే నిరుపేదలు తెగ భయపడుతున్నారు. శుక్రవారం బస్‌పాస్ ఛార్జీలను భారీగా పెంచుతూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. డీజిల్ ధరలు, సెస్సు, నిర్వహణ వ్యయం పెరగడంతో ఈ బస్‌పాస్ ఛార్జీలను సవరిస్తున్నట్లు ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మునుపటి ఛార్జీలతో పోలిస్తే, తాజాగా పెరిగిన ఛార్జీలు అత్యధికంగా 309 శాతం పెరిగాయి. గతంలో జారీ చేసిన బస్ పాసుల కాలం తీరేంత వరకు పాత ఛార్జీలే అమలులో ఉంటాయని, తాజాగా బస్ పాసులను తీసుకోబోయే వారికి పెంచిన ఈ ఛార్జీలను వసూలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో ఛార్జీల పెరుగుదల తక్కువగా ఉంది. రెండో దఫా పెంచిన డీజిల్ సెస్సును సైతం గ్రేటర్ హైదరాబాద్‌లో మినహాయించారు.

మరోపక్క పెరిగిన ఛార్జీల విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టాయి. పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఎండీ సజ్జానార్‌కు వినతిపత్రాలను అందజేశారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఆర్టీసీ ఛార్జీలపై నిరసన చేపట్టారు. కేసీఆర్ ప్రభుత్వం నిరుపేద ప్రజలను, విద్యార్థులను నానా అవస్థలు పెడుతుందని, త్వరలోనే టీఆర్ఎస్‌కు ప్రజలు, విద్యార్థులు, యువత సరైన గుణపాఠం చెప్తారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైన కేసీఆర్ కళ్లు తెరిచి, పెంచిన బస్ పాస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.