వాస్త‌విక‌త‌కు దృశ్య‌రూపం - MicTv.in - Telugu News
mictv telugu

వాస్త‌విక‌త‌కు దృశ్య‌రూపం

March 15, 2018

 సామాజిక ఇతివృత్తాల‌ను క‌థావ‌స్తువులుగా చేసుకొని సినిమాల్ని తెర‌కెక్కించ‌డంలో త‌మిళ ద‌ర్శ‌కులు ముందుంటారు. నిత్య‌జీవితంలో మ‌న క‌ళ్ల ముందు జ‌రుగుతున్న అనేక సంఘ‌ట‌ల‌కు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి సినిమాల్ని తెర‌కెక్కిస్తుంటారు. అర‌మ్ సినిమాతో ద‌ర్శ‌కుడు గోపీనైన‌ర్ అదే ప్ర‌య‌త్నం చేశారు. బోరుబావుల్లో ప‌డి ప్రాణాల‌ను వ‌దులుతున్న చిన్నారుల సంఘ‌ట‌న‌ల్ని ఇతివృత్తంగా ఎంచుకొని ఈ సినిమాను తెర‌కెక్కించారు.న‌య‌న‌తార క‌థానాయిక‌గా  త‌మిళంలో గ‌త ఏడాది విడుద‌లైన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు మంచి వ‌సూళ్ల‌ను సాధించింది.  ఈ సినిమాను నిర్మాత‌లు శర‌త్‌మ‌రార్‌, ఆర్‌.ర‌వీంద్ర‌న్ క‌ర్త‌వ్యం పేరుతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు. తెలుగులో న‌య‌న‌తారకు స్టార్‌డ‌మ్ ఉండ‌టం,గ‌తంలో ఆమె  న‌టించిన మ‌హిళా ప్ర‌ధాన చిత్రాలు చ‌క్క‌టి వ‌సూళ్ల‌ను సాధించ‌డంతో ఈసినిమా ప‌ట్ల అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది

Image result for karthavyam movie review

 

 

మ‌ధువ‌ర్షిణి(న‌య‌న‌తార‌) నిజాయితీప‌రురాలైన జిల్లా క‌లెక్ట‌ర్‌.ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ఎన్ని అడ్డంకులు ఎదురైన ధైర్యంగా పోరాడాల‌న్న‌ది ఆమె త‌త్వం.  అధికారి ఒత్తిడిల‌కు త‌లొగ్గ‌దు. బుల్లెబ్బాయి, సుమిత్ర నిరుపేద దంప‌తులు.  వారి కూతురు ధ‌న్సిక ఆ ఊరి కౌన్సిల‌ర్ నిర్ల‌క్ష్యంగా పూడ్చ‌కుండా వ‌దిలివేసిన బోరుబావిలో ప‌డుతుంది. ఆ చిన్నారిని ర‌క్షించే బాధ్య‌త‌ను మ‌ధువ‌ర్షిణి చేప‌డుతుంది. తొలుత ముప్ఫై అడుగుల లోతులో ప‌డిన ఓ చిన్నారిని ర‌క్షించే చ‌ర్య‌లు విఫ‌ల‌మ‌వ్వ‌డంతో తొంభై మూడు అడుగుల లోతుకు చేరుకుంటుంది. దాంతో ప్రాణాపాయ‌స్థితిలోకి చేరుకుంటుంది. ఆమెను ర‌క్షించ‌డానికి స్థానిక ప్ర‌భుత్వ అధికారులు చేసిన అన్ని ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌వుతాయి. దాంతో జాతీయ బృందం అక్క‌డ‌కు చేరుకుంటుంది. వారు చేసిన ఓ ప్ర‌య‌త్నం కార‌ణంగా ప్ర‌జలంతా ఆ ప్రాంతాన్నే వ‌దిలివెళ్లాల్సిన ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి త‌లెత్తుతుంది. మ‌రోవైపు నిరుప‌యోగ‌మైన బోరుబావిని పూడ్చ‌కుండా వ‌దిలివేసిన కౌన్సిల‌ర్‌ను ఆరెస్ట్ చేయాల‌ని చూసిన మ‌ధువర్షిణిని స్థానిక మంత్రులు,శాస‌న‌స‌భ్యులు అడ్డుకుంటుంటారు.

Image result for karthavyam movie

కానీ మ‌ధువ‌ర్షిణి వారి బెదిరింపుల‌కు భ‌య‌ప‌డ‌దు. ఆ పాప‌ను ర‌క్షించ‌డానికి ప్ర‌భుత్వ అధికారుల వ‌ద్ధ స‌రైన ప‌రిక‌రాలు లేక‌పోవ‌డంతో అందుకు సాధ్య‌ప‌డ‌దు. దాంతో అధికారుల‌పై న‌మ్మ‌కాన్ని కోల్పోయిన ఆ చిన్నారి త‌ల్లిదండ్రులు కూతురును తామే కాపాడుకోవ‌డానికి సిద్ధ‌ప‌డ‌తారు. వారిలో మ‌ధువ‌ర్షిణి మ‌నోధైర్యాన్ని నింపుతుంది. ఆ త‌ర్వాత ఏమైంది. ఆ చిన్నారి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డిందా లేదా? త‌న చెల్లెలిని కాపాడ‌టానికి చిన్నారి ధ‌న్సిక అన్న‌య్య ఎలాంటి సాహ‌సానికి సిద్ధ‌ప‌డ్డాడు? అధికార ఒత్తిడుల కార‌ణంగా క‌లెక్ట‌ర్‌గా ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డం అసాధ్య‌మ‌ని నిర్ణ‌యించుకున్న మ‌ధువ‌ర్షిణి  ఎలాంటి నిర్ణ‌యాన్ని తీసుకున్న‌ది అన్న‌దే ఈ చిత్ర ఇతివృత్తం.

Image result for karthavyam movie

బోరుబావిలో ప‌డి చిన్నారులు మృత్యువాత ప‌డుతున్న సంఘ‌ట‌న‌లు దేశంలో త‌రుచుగా ఎక్క‌డో ఒక‌చోట ఇప్ప‌టికీ సంభ‌విస్తూనే ఉన్నాయి. ఆ మ‌ర‌ణాల‌కు కార‌కులు ఎవ‌రు నిరూప‌యోగంగా ఉన్న ఆ బోరుబావుల‌ను పూడ్చ‌లేని య‌జ‌మానులా, వారిని ర‌క్షించ‌లేని నిస్స‌హాయులైన అధికారులా, ప్ర‌భుత్వ అధికారుల‌ విధినిర్వ‌హ‌ణ‌కు అడ్డుత‌గులుతున్నా రాజ‌కీయ నాయ‌కుల ఎవ‌ర‌ని  ప్ర‌శ్నిస్తూ ద‌ర్శ‌కుడు గోపీనైన‌ర్ ఈ చిత్రాన్ని రూపొందించారు.

Image result for karthavyam movie

అంత‌రిక్షంలోకి అడుగుపెడుతున్న మాన‌వుడు కేవ‌లం వంద అడుగుల లోతుకు ఎందుకు వెళ్ల‌లేక‌పోతున్నాడు బోరుబావిలో ప‌డిన చిన్నారుల‌ను ర‌క్షించే సాంకేతిక ప‌రిజ్ఞానాన్నిఎందుకు కనిపెట్ట‌లేక‌పోతున్నారు. ఆ సాంకేతిక‌త‌ను అభివృద్ధి చేసినా సామాన్యుల‌ను ప్ర‌భుత్వం ఎందుకు ప్రోత్స‌హించ‌డం లేదు ఇలా ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ సినిమాను న‌నిత్య‌జీవితంలో మ‌న  క‌ళ్ల ముందు జ‌రుగుతున్న య‌దార్థ సంఘ‌ట‌న‌ను క‌థా వ‌స్తువుగా చేసుకొని ఆద్యంతం స‌హ‌జంగా ఈ సినిమాను తెర‌కెక్కించారు ద‌ర్శ‌కుడు గోపీనైన‌ర్‌.  సినిమాలో ఎక్క‌డ నాట‌కీయ‌త‌, సినిమాటిక్ ఫీలింగ్ క‌నిపించ‌దు.  ఆద్యంతం బోరుబావిలో ప‌డిన చిన్నారిని ర‌క్షించే ప్ర‌య‌త్నాలు,క‌ళ్లెదుట చిన్నారి క‌నిపిస్తున్న ఆమె ర‌క్షించుకోలేని త‌ల్లిదండ్రుల దైన్య‌స్థితి, వారు ప‌డే మ‌నోవేద‌న అంశాలు చ‌ట్టే ఈ క‌థ సాగుతుంది. ఒకే అంశాన్ని చూపిస్తూ రెండు గంట‌ల పాటు క‌థ‌ను న‌డిపించ‌డం ఒక ర‌కంగా క‌త్తిమీద‌సాములాంటిదే. కానీ ఈ ప్ర‌య‌త్నంలో ద‌ర్శ‌కుడు పూర్తిగా స‌క్సెస్ అయ్యాడు. ఆద్యంతం ఆస‌క్తిక‌రమైన మ‌లుపుల‌తో భావోద్వేగ ప్ర‌ధానంగా సినిమాను న‌డిపించాడు. చిన్నారిని ర‌క్షించ‌డానికి న‌య‌న‌తార బృందం చేసే ప‌నులు ఉత్కంఠ‌త‌ను పంచుతాయి. క‌ర్త‌వ్య‌నిర్వ‌హ‌ణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు ఎదుర‌య్యే ఒత్తిడుల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా ఆవిష్క‌రించారు.

క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌కు తావులేకుండా య‌దార్థ కోణంలో సినిమాను న‌డిపించారు. క‌ళ్ల‌ముందు  న‌టీన‌టులు ఎంపిక‌, పాత్ర‌ధారుల ఆహార్యం అన్ని  స‌హ‌జంగా ఉండేలా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. క‌థ‌గ‌మ‌నాన్ని ప‌క్క‌దారి ప‌ట్టించే పాట‌లు,పోరాటాల, గ్లామ‌ర్ లాంటి హంగులేవి ఈ సినిమాలో క‌నిపించవు.  ముఖ్యంగా ప‌తాక ఘ‌ట్టాలు ఉత్కంఠ‌త‌కు లోనుచేస్తాయి.

Image result for nayanatara in karthavyam

అయితే న‌య‌న‌తార మిన‌హా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం ఉన్న న‌టీన‌టులు ఎవ‌రూ ఈసినిమాలో లేక‌పోవ‌డం మైన‌స్‌గా నిలుస్తుంది. దానికి తోడు క‌థాగ‌మ‌నం నిదానంగా సాగుతుంది. క‌థ తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ అయ్య‌దే అయినా  త‌మిళ ఛాయ‌లు ఈసినిమాలో ఎక్కువ‌గా క‌నిపిస్తాయి. తెలుగు ద‌నం క‌నిపించేలా త‌మ్మారెడ్ఢి భ‌ర‌ద్వాజ‌,సుద్ధాల అశోక్‌తేజ త‌దిత‌రులుపై కొన్ని స‌న్నివేశాల్ని రీషూట్ చేశారు. అవి అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఇలా కొన్ని చిన్న చిన్న లోపాలు ఈ సినిమాలో క‌నిపిస్తాయి.

నిజాయితీప‌రురాలైన క‌లెక్ట‌ర్‌గా అభిన‌యానికి ఆస్కార‌మున్న పాత్ర‌లో న‌య‌న‌తార అద్వితీయ‌మైన అభిన‌యాన్ని ప్ర‌ద‌ర్శించింది. క‌ళ్ల ముందే ఓ చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ర‌క్షించ‌లేని నిస్స‌హాయురాలిగా ఆమె న‌ట‌న మ‌న‌సుల్ని క‌దిలిస్తుంది. అధికార ఒత్తిడులు, ఉద్యోగ‌భాద్య‌త‌ల మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌కు లోన‌య్యే క‌లెక్ట‌ర్‌గాత‌న న‌ట‌న‌తో ఈసినిమాను నిల‌బెట్టింది. ఆమె మిన‌హా మిగ‌తా పాత్ర‌ల‌కు పెద్ద‌గా ప్రాధాన్య‌త లేదు. బోరుబావిలో ప‌డిన చిన్నారి త‌ల్లిదండ్రులుగా రామ‌చంద్ర‌న్‌,సునుల‌క్ష్మిల న‌ట‌న స‌హ‌జంగా ఉంది.

సాంకేతికంగా జిబ్రాన్ నేప‌థ్య సంగీతం, ఓం ప్ర‌కాష్ ఛాయాగ్ర‌హ‌ణం ఈ సినిమాకు ప్రాణంపోశాయి. ద‌ర్శ‌కుడి క‌థ‌ను మ‌రింత శ‌క్తిమంతంగా తెర‌పై చూపించ‌డానికి దోహ‌ద‌ప‌డ్డాయి. ఇలాంటి నిజాయితీతో కూడిన ప్ర‌య‌త్నాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించాల‌నే నిర్మాత‌లు శ‌ర‌త్‌మ‌రార్‌, ర‌వీంద్ర‌న్‌ ఆలోచ‌న అభినంద‌నీయం. సందేశాత్మ‌క క‌థాంశంతో తెర‌కెక్కిన మంచిసినిమాగా త‌ప్ప‌కుండా నిలుస్తుంది.

మూస‌ధోర‌ణితో కూడిన సినిమాల‌కు అల‌వాటు ప‌డిన తెలుగు ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త అనుభూతిని పంచే చిత్ర‌మిది. య‌దార్థ సంఘ‌ట‌న‌న‌ను క‌ళ్ల ముందు ఆవిష్క‌రించిన అనుభూతి క‌లుగుతుంది. స‌హ‌జత్వ క‌థాంశాలు, కొత్త‌ద‌నం కోరుకునే ప్రేక్ష‌కుల్ని ఈ సినిమా త‌ప్ప‌కుండా మెప్పిస్తుంది. క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఏ మేర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది ప్రేక్ష‌కుల నిర్ణ‌యంపైనే ఆధార‌ప‌డి  ఉంది.