మహారాష్ట్రలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. తన పార్టీ ఎమ్మెల్యేలు , ఎంపీలతో భేటీ అవుతున్నారు. తన నివాసంలో బుధవారం సాయంత్రం జరిగే సమావేశానికి అందరూ హాజరుకావాలని, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్‌షిండే.. సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. ఉద్దవ్ నివాసంలో జరిగే ఎమ్మెల్యేల భేటీ రాజ్యాంగ విరుద్దమన్నారు. ఉద్దవ్ వర్గానికి విప్ జారీ చేసే అధికారం లేదంటూ ట్వీట్ చేశారు. తన తిరుగుబాటు వెనుక బీజేపీ హస్తముందన్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇప్పటివరకు తాను బీజేపీ నేతలతో చర్చలు జరపలేదన్నారు. తామే నిజమైన శివసైనికులమన్నారు ఏక్నాథ్ షిండే.
మరోవైపు ఏక్‌నాథ్‌షిండేను తమ నేతగా ఎన్నుకున్నారు రెబల్ శివసేన ఎమ్మెల్యేలు. గవర్నర్‌కు 34 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారు. ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి పట్ల తాము అసంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. రాజకీయ వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ నేతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, వీటిని పార్టీ నాయకత్వం పట్టించుకోవట్లేదన్నారు. అందుకే తిరుగుబాటు చేస్తున్నామని చెప్పారు. అయితే అసెంబ్లీలోనే శివసేన పార్టీ అంటే తమదేనని, అందుకే ఏక్నాథ్ శిందేనే శివసేన శాసనసభాపక్ష నేతగా కొనసాగించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అయితే ఏక్నాథ్ షిండే క్యాంప్‌కు ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ హ్యాండివ్వడం కూడా సంచలనం రేపింది. తనను కిడ్నాప్ చేసి బలవంతంగా సూరత్ తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు. గుండెపోటు వచ్చినట్టు నాటకమాడి షిండే క్యాంప్ నుంచి తాను బయటకు వచ్చినట్టు తెలిపారు. ఇప్పటికి కూడా తన మద్దతు ఉద్దవ్‌ఠాక్రేకు ఉందని తెలిపారు.