అహ్మదాబాద్ పేలుళ్ల కేసుల్లో ప్రత్యేక న్యాయస్ధానం సంచలన తీర్పు ఇచ్చింది. ఏకంగా 38 మందికి మరణశిక్ష విధించింది. మరో 11 మందికి జీవిత ఖైదు విధించింది. 2008 జులై 26న అహ్మదాబాద్ నగరంలో ఉగ్రవాదులు మరణహోమం సృష్టించిన విషయం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేవలం 70 నిమిషాల్లో 21 చోట్ల ఉగ్రవాదులు పేలుళ్లు జరిపారు. ఆ ఘటనలో మొత్తం 56 మంది మరణించగా, 200 మంది పైగా గాయపడ్డారు.
ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు దేశంలోని పలు ప్రాంతాల నుంచి 78 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 49 మందిని దోషులుగా తేల్చారు. శుక్రవారం దోషుల్లో 38 మందికి మరణశిక్ష విధిస్తూ, 11మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పును వెలువరించింది.