చైనాలో విజృంభిస్తున్న కరోనా…భారత్‌ను కలవరపెడుతోంది. దేశంలో క్రమంగా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దీనికి తోడు కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే నాలుగు బీఎఫ్-7 కేసులు దేశంలో నమోదవ్వగా తాజాగా మరో నలుగురికి నిర్ధారణ అయింది. అమెరికా నుంచి కోల్‌కతాకు వచ్చిన వారి నమూనాలు స్వీకరించి జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా వారిలో నలుగురికి బీఎఫ్-7 సోకినట్లు తేలింది.
దీంతో అదికారులు అలర్ట్ అయ్యారు. వారిని వెంటనే గుర్తించి ఆరోగ్యపరిస్థితులను గమనిస్తున్నారు. వీరిలో ముగ్గురు పశ్చిమ బెంగాల్ నదియా జిల్లాకు చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు కాగా మరొకరు బీహార్ నుంచి కోల్‌కతాలో నివాసం ఉంటున్న వ్యక్తి అని అధికారులు తెలిపారు. వీరితో సన్నిహితంగా ఉన్న మరో 33 మంది ఆరోగ్యపరిస్థితిని గమనిస్తున్నారు.
కరోనావైరస్ మహమ్మారి గత కొద్ది వారాలుగా చైనా, అమెరికా, జపాన్ తదితర దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా చైనాలో పరిస్థితులు చేయదాటిపోయాయి.అక్కడ లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఆస్పత్రులు కరోనా పేషెంట్లతో పూర్తిగా నిండిపోయాయి. మెడిషన్ అందుబాటులో లేకపోవడంతో చైనీయులు భారతీయ మందులుపై ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు అక్కడ నిషేధం ఉన్న ఇండియన్ మందులను బ్లాక్ మార్కెట్లో కొంటున్నారు.
కరోనా మరోసారి పడగవిప్పడంతో భారత దేశం కూడా అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. పాజిటివ్ శాంపిల్స్ జీనోమ్ సీక్వెన్స్‌కు పంపాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.