బుడ్డోడు మామూలోడు కాదు..40 నిమిషాల్లోనే..
పిట్టకొంచెం.. కూత ఘనం అన్నట్టుగా ఈ బుడ్డోడు చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పెద్దవాళ్లకు కూడా సాధ్యం కాని పనిని అతి సులువుగా పూర్తి చేశాడు. తిరుమల కొండపైకి అలిపిరి నడకమార్గంలో కేవలం 40 నిమిషాల్లోనే చేరుకొని ఔరా అనిపించాడు. ఆగస్టు13న తన పుట్టిన రోజు నాడు ఈ ఫీటు చేశాడు. కేవలం నాలుగేళ్ల బాలుడు ఇంత సులభంగా, చురుగ్గా కొండపైకి చేరుకోవడం తెలిసిన ప్రతి ఒక్కరు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
సాధారణంగా యువకులు తిరుమల కొండ కాలినడకన వెళ్లాలంటే గంటన్న నుంచి రెండు గంటల సమయం పడుతుంది. కానీ కృష్ణా జిల్లా మోటూరుకు చెందిన తోనేశ్వర్ సత్య మాత్రం అవలీలగా 40 నిమిషాల్లోనే చేరుకున్నాడు. మూడున్నర ఏళ్ల వయస్సులో తొలిసారి తిరుమలకు వచ్చిన సత్య మెట్లు ఎక్కడం ప్రారంభించారు. ముందుగా అతన్ని తండ్రి సాయిబాబు ఎత్తుకొని పైకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే అతడు మాత్రం తానే వస్తానంటూ మారాం చేశాడు. వారితోపాటు మెట్ల మార్గం గుండా నడవటం ప్రారంభించాడు. మొదటిసారి 2 గంటల 20 నిమిషాల్లో కొండ ఎక్కాడు. ఏమాత్రం అలసట లేకుండా ఎక్కడం చూసిన కుటుంబ సభ్యులు అంతా దేవుడి దయ అనుకున్నారు. తర్వాత ప్రతి నెల సత్యను కొండపైకి ఎక్కించడం చేశారు. తాజాగా ఆగస్టు 13న కేవలం 40 నిమిషాల 20 సెకన్లలో తన టాస్క్ పూర్తి చేయడం విశేషం.