మణిపూర్లో ప్రభుత్వం ఉక్కుపాదం.. 40 మంది కాల్చివేత
మణిపూర్‌లో తిరుగుబాటుదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఒక్క రోజే 40 మందిని హతమార్చింది. మణిపూర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్ తిరుగుబాటుదారులను ఉగ్రవాదులతో పోల్చారు. అల్లర్లకు పాల్పడుతున్న 40 మంది ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు ప్రకటించారు. ‘‘ సాధారణ పౌరులపై ఎమ్-16, ఏకే-47, స్నైపర్ గన్లతో ఉగ్రవాదులు దాడికి దిగుతున్నారని, ఊళ్లలోకి ప్రవేశించి ఇళ్లకు నిప్పు పెడుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ, ఇతర భద్రతాబలగాల సాయంతో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటి వరకు 40 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారని ఎన్. బీరేన్ సింగ్ మీడియాకు చెప్పారు.
తిరుగుబాటుదారులను కుకీ మిలిటెంట్లుగా పరిగణించలేమని వాళ్లంతా ఉగ్రవాదులని, నిరాయుధులైన సాధారణ ప్రజలపై వాళ్లు కాల్పులకు తెగబడుతున్నారని అని బీరేన్ అన్నారు. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇంఫాల్‌లోని సేక్‌మయి, సుంగు, ఫయేంగ్, సెరయు తదితర ప్రాంతాల్లో తిరుగుబాటువాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురు కాల్పులకు దిగారు. వీధుల్లో గుర్తు తెలియని మృతదేహాలు చెల్లాచెదురుగా పడిఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 10 మంది వ్యక్తులు బుల్లెట్ గాయాలతో పయేంగ్‌లోని రిమ్స్ ఆస్పత్రిలో చేరినట్లు డాక్టర్లు చెప్పారు.
ఆదివాసీలు మెయిటీల మధ్య పోరుతో మణిపూర్ లో గత కొన్ని రోజులుగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్టీ హోదా కోసం మెయిటీలు చేసిన డిమాండ్‌కు మణిపూర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. ఫలితంగా గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మణిపూర్ జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తున్న అక్రమ వలసదారులతో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.