నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సమీపంలోని పెర్కిట్ జాతీయ రహదారి(NH44)పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టింది. దీంతో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అజాగ్రత్త వల్లే రోడ్డు ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. క్షతగాత్రులను ఆర్మూర్, నిజామాబాద్ ఆస్పత్రులకు తరలించారు. బస్సు 38 మంది ప్రయాణికులతో రాయచూర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్ బాబు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండి బస్సు నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
ఉత్తర, దక్షిణ రాష్ట్రాలను కలిపే ఈ జాతీయ రహదారి ప్రమాదాలకు కేరాఫ్‌గా మారింది. హైవే నిర్మాణంలో లోపాలే ప్రమాదాలకు కారణంగా తెలుస్తోంది. ప్రధానంగా ఈ హైవేకు సర్వీస్ రోడ్లు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ విషయంలో హైవే అథారిటీ ఆఫీసర్ల నిర్లక్ష్యం కనిపిస్తోంది. గన్నారం వద్ద సర్వీస్ రోడ్ లేకపోవడంతో యూటర్న్ వద్ద జరుగుతున్న ప్రమాదాల్లో వాహనదారులు, స్థానిక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఏడాదిన్నరగా సుమారు 100 ప్రమాదాలు జరగగా 60 మంది వరకు చనిపోయారు.
నేషనల్ హైవే 44 పై యాక్సిడెంట్స్ నివారణకు చర్యలు చేపట్టామని కొన్ని రోజులే క్రితమే నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. హైస్పీడ్ వల్లనే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని, గన్నారం వద్ద సర్వీస్ రోడ్ సమస్యను గుర్తించామని, ఈ సమస్యను హైవే అథారిటీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. హైవేలో యూటర్న్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని కూడా అన్నారు.