బుర్ఖా ధరించిన మహిళ స్విగ్గీ బ్యాక్ ప్యాక్ తో లక్నోలో రోడ్డు పై నడుచుకుంటూ వెళ్తున్న ఫోటోను ఎవరో క్లిక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొన్ని గంటల్లోనే వైరల్ అయింది. అయితే ఆ మహిళ గురించి ఇప్పుడు అసలు కథనం తెలిసింది.
కొన్నిసార్లు కొన్ని విషయాలు ఎందుకు వైరల్ అవుతాయో తెలియదు. అలాగే ఈ స్విగ్గీ బ్యాగ్ వేసుకున్న మహిళ ఫోటో విషయంలోనూ అదే జరిగింది. కాలినడకన వెళ్లి ఫుడ్ డెలివరీ చేస్తుందని అందరూ పొగిడారు. వెనుక నుంచి ఫోటో తీయడంతో ఆమె ఎవరనేది ఎవరూ తెలుసుకోలేకపోయారు. చివరకు నిజం తెలిసింది. కానీ నిజానికి ఆమె ఫుడ్ డెలివరీ ఏజెంట్ కాదు.. ఒక ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంది. అది తెలిసి అందరూ అవాక్కవుతున్నారు.
కుటుంబ కథ..
బుర్ఖా ధరించిన ఆ 40 యేండ్ల మహిళ పేరు రిజ్వానా. లక్కో నివాసి. ఆమె గురించి వైరల్ అవుతున్న విషయం గురించి ఒక దుకాణాదారుడు తెలిపాడు. ఎలా వైరల్ అయిందో రిజ్వనా తెలుసుకుంది. అయితే తన కథను తన మాటల్లో.. ‘నేను ఉదయం, సాయంత్రం ఇళ్లలో పనిమనిషిగా పనిచేస్తాను. అలా చేస్తే కేవలం 1500 మాత్రం సంపాదించగలను. మధ్యాహ్నం మార్కెట్ లోని స్టాల్స్ లో డిస్పోజబుల్ గ్లాసెస్, దుస్తులను విక్రయిస్తాను. ఒక గ్లాసెస్ ప్యాకెట్ కు నాకు 2 రూపాయలు వస్తాయి. అలా మొత్తం నేను 5వేల నుంచి 6వేల రూపాయలు సంపాదిస్తాను. ఇది నా కుటుంబానికి సరిపోదు. నాకు నలుగురు పిల్లలు. 22 యేండ్ల లుబ్నా, 19యేండ్ల బుష్రా, ఏడేళ్ల నష్రా, చిన్న కుమారుడు ఎండి యాషి ఉన్నారు. నా వివాహం 23యేండ్ల క్రితం అయింది. అతను రిక్షా తొక్కేవాడు. ఒకరోజు రిక్షా దొంగిలించారు. దీంతో ఒకరోజు భిక్షాటనకు వెళ్లి తిరిగి రాలేదు. ప్రస్తుతం అత్తమామల దగ్గర ఒక గది అద్దెకు తీసుకొని ఉంటున్నా’ అని చెప్పింది.
బ్యాగ్ గురించి..
‘నాకు డిస్పోజబుల్ గ్లాసెస్, కప్పులు ఉంచడానికి బలమైన బ్యాగ్ అవసరం. కాబట్టి దాలిగంజ్ వంతెన వద్ద ఒక వ్యక్తి బ్యాగు అమ్ముతుంటే 50 రూపాయలు పెట్టి కొన్నాను. అప్పటి నుంచి నా వస్తువులను అందులో తీసుకెళతాను. నేను స్విగ్గీ కోసం పని చేయను. ఈ బ్యాగులో నా వస్తువులన్నీ పెట్టుకొని ప్రతిరోజూ దాదాపు 20 నుంచి 25 కి.మీ.లు ప్రయాణిస్తాను. నాకు ఫుడ్ డెలివరీ సేవల గురించి పూర్తిగా తెలియదు. ఒక వేళ నేను ఈ ఉద్యోగం చేయాలన్నా నా వద్ద ఎలాంటి రవాణా సౌకర్యం లేదు. నా ఫోటో వైరల్ అయ్యాక ఒకతను వచ్చి నా బ్యాంక్ వివరాలు అడిగి తెలుసుకున్నాడు. నేను కొంతమంది వ్యక్తుల వద్ద నుంచి సహాయం అయితే పొందాను. నా జీవితం మంచిగా మారుతుందని ఆశిస్తున్నా’ అంటూ తన కథని రిజ్వానా పంచుకుంది.