నిర్లక్ష్యం ఖరీదు.. 4 వేల మూగజీవుల ఆకలి చావు - MicTv.in - Telugu News
mictv telugu

నిర్లక్ష్యం ఖరీదు.. 4 వేల మూగజీవుల ఆకలి చావు

October 2, 2020

4,000 dogs, cats, rabbits and other pets found no more in boxes at logistics depot in China.

నిర్లక్ష్యంతో 4 వేల మూగజీవుల(శునకాలు, పిల్లులు, కుందేళ్లు ఇతర జంతువులు) ప్రాణాలు తీశారు. తిండీతిప్పలు లేక డబ్బాల్లో మగ్గి అత్యంత దారుణంగా ఆకలి చావు చచ్చాయి.  హెనాన్ ప్రావిన్స్‌లోని లౌహె నగరంలోని డాంగ్‌షింగ్ లాజిస్టిక్స్ స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వాటిని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయగా, షిప్పింగ్ చేసే సంస్థ వద్ద వారం రోజులపాటు చిక్కుకుపోయాయి. జంతువులు ఉన్న ప్లాస్టిక్ కప్ బోర్డులు షిప్పింగ్ చేస్తున్న సంస్థ వద్ద వారం రోజులపాటు చిక్కుకుపోవడమే ఇందుకు కారణం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న యుతోపియా యానిమల్ రెస్క్యూ అనే సంస్థ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బతికి ఉన్న జంతువులను రక్షించింది. డబ్బాల్లో 4 వేల జంతువులు మృత్యువాత పడగా, శునకాలు, వెయ్యి కుందేళ్లు, చిట్టెలుకలు, పిల్లులను కాపాడారు. వీటిలో కొన్నింటిని ఆ సంస్థ దత్తత తీసుకోగా, తిండిలేక శుష్కించి అనారోగ్యం పాలైన వాటిని వైద్యం నిమిత్తం వెటర్నరీ క్లినిక్స్‌కు తరలించారు. 

ఈ విషయమై యుతోపియా వ్యవస్థాపకురాలు సిస్టర్ హువా మాట్లాడుతూ.. ‘మేము అక్కడికి చేరుకునే సరికే పెట్టెల్లో ఉన్న కొన్ని జంతువులు చనిపోయాయి. కుళ్లిపోయి భయంకరమైన దుర్వాసన వస్తోంది. జంతువులు ఊపిరి ఆడక, నీళ్లు లేక ఆకలితో అలమటించి చనిపోయాయి. కరోనా సమయంలో వాటిని రవాణా చేసిన తీరు చాలా భయంకరంగా ఉంది’ అని వాపోయారు. కాగా, ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌లో పెంపుడు జంతువుల విక్రయాలపై చైనాలో నియంత్రణ లేదన్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అనేక విమర్శలు వెల్లువెత్తాయి.