431 kg of gold and silver seized by ED
mictv telugu

ఈడీ రైడ్స్.. 431 కిలోల బంగారం, వెండి సీజ్.. విలువెంతంటే

September 14, 2022

బ్యాంకులను మోసం చేసి వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన ఓ సంస్థకు చెందిన రహస్య లాకర్లలో ఈడీ సోదాలు జరిపింది. ఇందులో మూడు లాకర్లలో భారీగా బంగారం, వెండి కడ్డీలు దొరికాయి. వీటి విలువ రూ. 47 కోట్లకు పైనే ఉంటుందని అంచనా. పరేఖ్ అల్యూమినెక్స్ లిమిటెడ్ అనే కంపెనీ పలు బ్యాంకుల నుంచి రూ. 2296.58 కోట్ల రుణం తీసుకుంది. తిరిగి కట్టకపోవడంతో 2018లో మనీలాండరింగ్ కేసు నమోదైంది. ఈ కేసు విచారణలో భాగంగా సోదాలు నిర్వహించగా, రహస్య ప్రైవేట్ లాకర్లు ఉన్నాయని గుర్తించింది. వాటిని తెరచిన అధికారులు అందులో ఉన్న బంగారం, వెండిలను చూసి షాక్ తిన్నారు. మొత్తం మూడు లాకర్లలో 91.5 కిలోల బంగారం, 340 కిలోల వెండిని గుర్తించారు. ఇదే కేసులో 2019లో ఈడీ అధికారులు రూ. 205 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సరైన నిబంధనలు పాటించకుండా లాకర్లు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కేవైసీ పాటించకపోవడం, సీసీ కెమెరాలు లేకపోవడం, ఇన్ అండ్ అవుట్ రిజిస్టర్ సమాచారం లేకపోవడం వంటివి చూసి ఈడీ అధికారులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సోదాలు ఎక్కడ జరిగాయో ఈడీ వెల్లడించకపోయినప్పటికీ ఢిల్లీలో జరిగినట్టు తెలుస్తోంది.