గొంతు విప్పడానికి వీల్లేదు. కలం కదలకూడదు. అక్షరం ఆవేశపడకూడదు. అంతా, ఆమె చెప్పినట్టే నడవాలి. అందరూ గంగిరెద్దుల్లా తల ఊపాలి. ఇంకా వీలైతే ఆమెకు చెప్పే శ్వాస తీసుకోవాలి. ప్రతిఘటిస్తే జైళ్లు నోళ్లు తెరుస్తాయి. గట్టిగా ప్రతిఘటిస్తే చట్టబద్ధ ఎన్కౌంటర్లు రికార్డవుతాయి. ఈ ఉపోద్ఘాతం దేని గురించో అర్థమై ఉంటుంది. అవును. ఎమర్జెన్సీ గురించే..!!
అర్ధరాత్రి ఉక్కుపాదం
మన దేశ చరిత్రలో అవి చీకటి రోజులు. అహం దెబ్బతిన్న ఆ మహిళ ఒంటెద్దు పోకడకు, క్రూర మనస్తత్వానికి అద్దం పట్టే చారిత్రక సాక్షాలు. అర్థరాత్రి వచ్చిన స్వాతంత్ర్య వెలుగులను అర్థరాత్రి చీకట్లోకి నెట్టేసిన నిర్ణయాలు. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం ఇదే రోజు దేశ వ్యాప్తంగా ఎమెర్జెన్సీ అమల్లోకి వచ్చింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 ఆధారంగా దేశంలో ఎమర్జెన్సీ విధించారు.
1975 జూన్ 25వ తేదీన అర్థరాత్రి 11 గంటల 45 నిమిషాలకు ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. మరుసటి రోజు రేడియో ద్వారా దేశ ప్రజలకు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచీ 1977 మార్చి 21వ తేదీ దాకా అంటే 21 నెలల పాటు దేశంలో కరడుగట్టిన నియంతృత్వం రాజ్యమేలింది. ఎమర్జెన్సీ విధించడానికి కేవలం ఇందిరపై దాఖలైన కేసులో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు రావడం మాత్రమే కారణం కాదు, పలు రాష్ట్రాల్లో నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రుల అవినీతి, అక్రమాల మీద జనం నుంచి మొదలైన ఉద్యమాలు కూడా ప్రధాన కారణం.
ఎందుకు?
పాకిస్తాన్‌తో 1971లో జరిగిన రెండో యుద్ధం తర్వాత మన దేశ దేశ ఆర్థిక పరిస్థితి చాలా చితికి పోయింది. యుద్ధం తర్వాత బంగ్లాదేశ్ నుంచి దాదాపు 80 లక్షల మంది శరణార్ధులు సరిహద్దు దాటి దేశంలోకి వచ్చారు. వారికి ఆశ్రయం, ఆహారం అందించడంలో ఇందిరకు కష్టంగా మారింది. అదే సమయంలో భారత్‌పై అమెరికా ఎన్నో ఆంక్షలు విధించింది. ముడిచమురు దిగుమతి మీద భారీగా సుంకం పెంచింది. దీంతో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. జనం ధరల తాకిడికి అల్లాడి పోయారు.
ఇదే సమయంలో గుజరాత్ అల్లర్లు ఇందిరాగాంధీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అహ్మదాబాద్ ఎల్డీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యార్ధులు అధిక ఫీజులకు వ్యతిరేకంగా ఆందోళనలకు దిగారు. వారి ఉద్యమానికి ఆ రాష్ట్రంలోని అన్ని యూనివర్శిటీల విద్యార్థులు మద్దతు పలికారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న చిమన్ భాయ్ పటేల్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇక విద్యార్థుల ఉద్యమానికి ప్రజలతో పాటు కార్మికులు, రైతులు, వ్యాపారస్తులు మద్దతు పలకడంతో హింస రేగింది.
చిమన్ భాయ్ ప్రభుత్వాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. మొదట్లో ఈ అల్లర్లను అణచాలని భావించిన ఇందిర ప్రభుత్వం, ఆ తర్వాత చేసేది లేక 1974 ఫిబ్రవరిలో పటేల్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించింది. ఇక అదే ఏడాది పెంచిన ఫీజులు రద్దు చేయాలంటూ లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో విద్యార్ధి సంఘాలు బిహార్ వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. హింస భారీగా చెలరేగింది. ఆ తర్వాత సంపూర్ణ విప్లవానికి జేపీ పిలుపు ఇవ్వడంతో అది ప్రజా ఉద్యమంగా మారింది. ఈ ఉద్యమం కూడా ఇందిర ప్రభుత్వాన్నికి మింగుడు పడలేదు.
ఇక 1974 మేలో రైల్వే ఉద్యోగులు సమ్మెకు దిగారు. కార్మి నేత జార్జ్ ఫెర్నాండెజ్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు. దీంతో వేలాది మంది ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది. వారి కుటుంబాలను రైల్వే క్వార్టర్స్ నుంచి బలవంతంగా గెంటేసింది. ఇది సగటు భారతీయుడికి ఆగ్రహం కలిగింది. ఈ సంఘటనలన్నీనాటి ‘ఉక్కు మహిళ’కు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. అదే సమయంలో తనపై నమోదైన కేసు ఆమెను విస్తుపోయేలా చేసింది.
1969లో కాంగ్రెస్ పార్టీలో చీలిక వచ్చింది. దీంతో 1971లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి 351 సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో ఇందిర అక్రమాలకు పాల్పడ్డారనీ, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని రాజ్ నారాయణ్ అనే వ్యక్తి అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాలుగేళ్ల పాటు ఈ కేసు విచారించిన అలహాబాద్ హైకోర్టు, ఇందిర పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హురాలిగా తేలుస్తూ 1975 జూన్ 12వ తేదీన తీర్పు జారీ చేసింది. ఆ తర్వాత అదే ఏడాది జూన్ 24వ తేదీన అలహాబాద్ కోర్టు తీర్పు మీద సుప్రీం కోర్టు స్టే విధించినా, తనకు వ్యతిరేకంగా అలహాబాద్ కోర్టు తీర్పు ఇవ్వడంతో ఆమె అహం దెబ్బతింది. అదే సమయంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆమెను చాలా ఇరకాటంలో పడేశాయి.
ఏం జరిగింది?
అందుకే సర్వరోగ నివారిణి అన్న ఇందిరా గాంధీ ఆలోచన నుంచి పుట్టింది ఎమర్జెన్సీ. 1975 జూన్ 25వ తేదీ అర్థరాత్రి మొదలైన ఎమర్జెన్సీలో ఎన్నో అకృత్యాలు జరిగాయి. ప్రభుత్వాన్ని విమర్శించే పత్రికలను మూసేయించారు. విపక్ష నేతలను జైల్లో పెట్టి హింసించారు. బెయిళ్లు రాకుండా మగ్గబెట్టారు. ఇందిర కొడుకు సంజయ్ గాంధీ ఆదేశాలతో సామూహిక కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వేలాది జరిగాయి.
మనుషులను పశువుల్లా ఆస్పత్రులకు తోలారు. 1975 జులై 1వ తేదీన పౌర హక్కులపై ప్రధాని ఆంక్షలు విధించారు. అదే ఏడాది ఆగస్టు 5వ తేదీన దేశ వ్యాప్తంగా అంతర్గత భద్రత చట్టం అమల్లోకి తెచ్చారు. ఇక 1976 జనవరి 9వ తేదీన రాజ్యాంగం నిర్దేశించిన స్వేచ్చా నిబంధనలను ఉక్కుపాదంలో అణిచి వేశారు. అదే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీన లోక్ సభ కాలపరిమితిని ఏడాది పొడిగించారు. అదే ఏడాది మే 21వ తేదీన కోర్టుల నుంచి కొన్ని చట్టాలను రక్షించే పేరుతో రాజ్యాంగ సవరణ చేశారు.
ప్రజాస్వామ్యం గెలిచింది..
అంతేకాదు, ఎమర్జెన్సీని వ్యతిరేకించిన పలు పార్టీల నేతలను, విద్యార్థులను, సామాన్య ప్రజలకు నిస్సిగ్గుగా జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు. ఆర్ఎస్ఎస్, జమాత్ ఏ ఇస్లాం సంస్థల మీద ఆంక్షలు విధించారు. ఆ చీకటి రోజుల్లో ఇందిర ప్రభుత్వం చేసిన అన్యాయాలు, అరాచకాలు అన్నీ ఇన్నీ కావు.
ఆ తర్వాత 1977 జనవరి 18వ తేదీన సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. అలాగే 1977 జనవరి 24వ తేదీన జనతా పార్టీ ఆవిర్భవించింది. అదే ఏడాది మార్చి 16వ తేదీన మొదలైన ఎన్నికల్లో విజయం తమదేనని ఇందిర ఆశపడ్డారు. కానీ ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ, అదే ఏడాది మార్చి 21వ తేదీన ఎమర్జెన్సీ తొలగించింది. ఈ విధంగా 21 నెలల పాటు దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి అధ్యాయానికి సాక్షీ భూతంగా నిలిచింది. ప్రజాస్వామ్యం, పౌరహక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ ఎంత విలువైనవో గుర్తు చేసింది.