మెక్సికో నుంచి అమెరికాకు జరుగుతున్న మానవ అక్రమ రవాణాకు సంబంధించి సంచలన విషయం బయటపడింది. టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియాలో ఓ ట్రక్కులో 46 మృతదేహాలను అధికారులు గుర్తించారు. ట్రెయిల్లో దాక్కున్న మరో 16 మందిని గుర్తించి వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో నలుగురు మైనర్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ట్రక్కులో కలిగిన వేడి వల్ల వీరంతా ఊపిరాడక చనిపోయారని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ట్రక్కు ఉన్న ప్రాంతంలో సోమవారం ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 39.4 డిగ్రీలు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. దీనిపై మెక్సికో విదేశాంగ మంత్రి స్పందిస్తూ టెక్సాస్‌లో తీరని విషాదమని ట్వీట్ చేశారు. స్థానిక రాయబార కార్యాలయ అధికారులు సంఘటనా స్థలానికి బయల్దేరారని పేర్కొన్నారు. కాగా, మెరుగైన జీవనం కోసం మెక్సికో నుంచి అమెరికాకు ప్రజలు పెద్ద ఎత్తున వలస వెళ్తుంటారు. ట్రంప్ హయాంలో వలసలను అడ్డుకునేందుకు సరిహద్దులో గోడ కట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో బైడెన్ వలస విధానంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.