షాక్.. కరోనా రోగి ఇంట్లో 46 మంది - ఇల్లే ఐసోలేషన్ - MicTv.in - Telugu News
mictv telugu

షాక్.. కరోనా రోగి ఇంట్లో 46 మంది – ఇల్లే ఐసోలేషన్

April 5, 2020

46 Corona patient at home .. Isolation at home

ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారి గురించి అధికారులు ముమ్మరంగా సర్వే చేస్తున్న విషయం తెలిసింది. వారి సర్వేలో కింగ్ కోఠి పరదా గెట్‌లో ఓ వ్యక్తిని గుర్తించి అతన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. మరో విస్తుపోయే విషయం ఏంటంటే.. అతనిది ఉమ్మడి కుటుంబం అని.. ఒకే ఇంట్లో 46 మంది కుటుంబ సభ్యులు కలిసి ఉంటారని తెలిసి అధికారులు షాక్ అయ్యారు. అతని ద్వారా వారిలో ఎంతమందికి కరోనా సోకి ఉంటుందనే విషయంలో ఇప్పుడు అధికారులకు తలనొప్పిగా మారింది. వారందరికీ గాంధీ వైద్యురాలు దీప్తి ప్రియాంక ఆధ్వర్యంలో ఇంట్లోనే వైద్య పరీక్షలు చేస్తున్నారు. వారి శాంపిళ్లు సేక‌రించి గాంధీ ఆస్పత్రిలో టెస్టులకు పంపుతామని వైద్యులు తెలిపారు. వారి చేతులపై క్వారంటైన్ స్టాంప్ వేసి ఇంటి నుంచి ఎవరూ బ‌య‌ట‌కు రావొద్దని సూచించామ‌ని వైద్యులు చెప్పారు. పరీక్షల్లో వారిలో ఎవరికి  పాజిటివ్ అని తేలినా.. వారిని ఆసుపత్రికి త‌ర‌లిస్తాం అని తెలిపారు. 

మరోవైపు పరదాగెట్ ప్రాంతం నుంచి ప్రార్థనలకు వెళ్లొచ్చిన మరో నలుగురిని గాంధీ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. వారి ఫలితాలు రావాల్సి ఉంది. అయితే వారు ఒక్కొక్కరి కుటుంబంలో 20 మంది ఉన్నారని తెలుస్తోంది. కాగా, తెలంగాణలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ మ‌ర్కజ్‌కు వెళ్లి తిరిగి వ‌చ్చినవారి వల్ల క‌రోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. హైద‌రాబాద్ నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన వారిని గుర్తించేందుకు పోలీసులు, హెల్త్ టీమ్స్ ఇంటింటికీ తిరుగుతూ విచారణ చేపడుతున్నాయి.