48 arrested for theft in Turkey after earthquake
mictv telugu

భూకంపం తర్వాత టర్కీలో రెచ్చిపోతున్న దొంగలు, 48 మంది అరెస్టు..!!

February 12, 2023

48 arrested for theft in Turkey after earthquake

టర్కీ, సిరియాలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం దాదాపు 28వేల మందిని మింగేసింది. లక్షలాది మంది ప్రజలు గాయపడ్డారు. అయినవారి ఎక్కడున్నారో కొందరు…అసలు బతికి ఉన్నారా లేరా అని కొందరు కన్నీళ్లు దిగమింగుకుంటూ బతుకుతున్నారు. ఎక్కడ చూసినా హృదయవిదారక ఘటనలే కనిపిస్తున్నాయి. ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అంటూ దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. టర్కీలో భూకంపం తర్వాత దొంగతనాలు ఎక్కువయ్యాయి. దాదాపు 48మంది అరెస్టు చేసినట్లు వార్తా సంస్థ AFP ప్రభుత్వ మీడియాను ఉటంకిస్తూ పేర్కొంది.

టర్కీ అధికారిక గెజిట్‌లో ప్రచురించబడిన డిక్రీ ప్రకారం, దోపిడీ నేరాలకు పాల్పడినవారిని అరెస్టు చేసినట్లు తెలిపింది. పరిస్థితులు చక్కబడే వరకు నిందితులను జైళ్లోనే ఉంచుతామని అధికారులు వెల్లడించారు. అంతకుముందు టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ దొంగతనాలకు పాల్పడేవారికి క్షమించే ప్రసక్తే లేదని..కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

భూకంపం సంభవించిన దియార్‌బాకిర్ ప్రావిన్స్‌లో పర్యటించిన సందర్భంగా టర్కీ అధ్యక్షుడు మాట్లాడుతూ “మేము అత్యవసర పరిస్థితిని ప్రకటించాము. ఇక నుంచి దోపిడీలు, కిడ్నాప్‌లకు పాల్పడే వారికి దేశ చట్టంలోని బలమైన హస్తం వెన్నుదన్నుగా ఉందని తెలుసుకోవాలని ఎర్డోగన్ అన్నారు. భూకంపం సంభవించిన ఆగ్నేయ టర్కీలోని 10 ప్రావిన్సులలో ఎర్డోగాన్ మూడు నెలల అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.

భూకంప మృతుల సంఖ్య పెరిగింది
CNN నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 12న టర్కీ, సిరియాలో సంభవించిన శక్తివంతమైన భూకంపం నుండి మరణించిన వారి సంఖ్య 28000 కంటే ఎక్కువ పెరిగింది. టర్కీ ప్రెసిడెంట్ ప్రకారం, టర్కీలో మరణాల సంఖ్య 21,848కి పెరిగింది. కాగా ఆగ్నేయ నగరం సాన్లియుర్ఫాలో సంభవించిన భూకంపంలో 80,104 మంది గాయపడ్డారు.