48 వేల కోట్ల రూపాయలను మనం ఎప్పుడు సంపాదిస్తాం? జీవిత కాలం తలకిందులు తపస్సు చేసినా, రాత్రింబవళ్ళు ఎంత కష్టపడ్డా అంత మొత్తం సంపాదించలేమన్నది నిజం. కానీ ఒక నర్సు సంపాదించింది. ఏంటీ ఒక నర్సు అంత సంపాదించడమా ? జోకా ? అన్నట్టే వుంది కదూ. జోక్ కాదు నిజం. అసలు విషయంలోకెళ్తే మస్సాచుసెట్ట్స్ కు చెందిన 53 ఏళ్ల మావిస్ వాంస్జిక్, మెర్సీ మెడికల్ కేర్ లో ఆయా (పేషెంట్లకు సహయకురాలు) గా పని చేస్తోంది. పశ్చిమ బోస్టన్ లోని చికొప్పి స్టోర్ లో కుటుంబ సభ్యుల పుట్టినరోజు తేదీల సంఖ్య ఆధారంగా ఓ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసింది. అది తననిలా కోటీశ్వరురాలిని చేస్తుందని అస్సలు అనుకోకపోవచ్చు. కొన్ని మనం అనుకోనివే నిజమౌతాయి. తన విషయంలో కూడా అలాంటి మిరకిలే జరిగింది.
గురువారం దాని ఫలితం వెలువడగా, సుమారు 758.7 మిలియన్ డాలర్ల( సుమారు 48 వేల కోట్లు) జాక్ పాట్ తగిలినట్లు ప్రకటించారు. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మావిస్ గత నవంబర్ లో యాక్సిడెంట్లో భర్తను కోల్పోయింది. ఆర్థికంగా పెద్దగా కష్టాలు లేని కుటుంబం ఆమెది. అయినా పిల్లలతోపాటు ఆమె కూడా ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే వస్తోంది. సుమారు 758.7 మిలియన్ డాలర్ల లాటరీని సొంతం చేసుకుని ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బవుతోంది. దెబ్బకు దరిద్రం వదలడం అంటే ఇదే కదా. లక్ష్మీ వచ్చి నట్టింట్లో తిష్ఠ వెయ్యటం అంటే కూడా ఇదేనేమో.
అయితే అనుకోకుండా తగిలిన ఈ జాక్పాట్తో తన కుటుంబం స్థిరపడినట్లేనని ఆమె చెబుతోంది. అన్ని టాక్స్‌లు పోను ఆమె చేతికి 336 మిలియన్ డాలర్లు అందుతాయి. ఇక ఆమెకు అభినందనలు తెలుపుతూ మస్సాచుసెట్ట్స్ స్టేట్ లాటరీ అసోషియేషన్ ఏర్పాటు చేసిన ఓ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయగా అందులో ఆమె ప్రసగించింది. ‘లాటరీ వాళ్ల దగ్గరి నుంచి మళ్లీ ఫోన్ వస్తుందని ఊహించలేదు. మొదట భయపడిపోయా. తర్వాత ఇదంతా నిజమేనా అని మరోసారి ధృవీకరించుకున్నా. ఇప్పుడు ఆనందంలో ఉన్నా. ఇంటికెళ్లాక మంచం కింద దాక్కుంటా. ఓ నల్ల కళ్లజోడు పెట్టుకుని ఖరీదైన డ్రెస్, కాస్ట్లీ నగ వేసుకుని సంబరాలు చేసుకుంటా ’ అని తెలిపింది. కొత్తగా కొన్న కారు లోను క్లియర్ చేయటంతోపాటు, ఉద్యోగం వదిలేసిన ఆమె మిగతా డబ్బును ఎలా ఖర్చుపెట్టాలన్న దానిపై ఫ్లాన్ చేస్తోందంట. ఈమె గతంలో ఎప్పుడో ఎక్కడో నక్క తోక తొక్కుంటుంది. దాని రిజల్టు ఇప్పుడిలా వచ్చుంటుంది.
ఇక అమెరికా చరిత్రలోనే ఇదే అత్యధిక సింగిల్ టికెట్ లాటరీ అని సమాచారం. గతేడాది జనవరిలో 1.6 బిలియన్ డాలర్ల లాటరీ తగిలినప్పటికీ అది ముగ్గురు వ్యక్తులకు (షేరింగ్ లాటరీ) చెందడటంతో ప్రస్తుతం మావిస్కు తగిలిన లాటరీనినే హయ్యెస్ట్ లాటరీగా పరిగణిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తను తన తర్వాత తన పిల్లలు, వాళ్ళ పిల్లలు ఇలా ఏడు తరాలు కూర్చొని తిన్నా తరగని డబ్బు అది కదా. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో సగం రకం అన్నమాట.