48 vehicles damaged on Pune-Bengaluru highway as tanker loses control, rescue on
mictv telugu

బ్రేకులు ఫెయిలై బీభత్సం.. ఒకే ప్రమాదంలో 48 వాహనాలు ధ్వంసం

November 21, 2022

మహారాష్ట్రలోని పుణెలో ఓ లారీ బీభత్సం సృష్టించింది. పుణె- బెంగళూరు హైవేపై ఉన్న ఓ బ్రిడ్జి వద్ద ఆయిల్ ట్యాంకర్ ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 48 వాహనాలు ధ్వంసమయ్యాయి. సుమారు 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఓ ట్యాంకర్‌ లారీ వేగంగా వెళ్తుండగా బ్రేకులు పని చేయకపోవటంతో ముందు వెళ్తున్న వాహనాలను ఢీకొట్టింది. అందులోని చమురు రోడ్డుపై పడటంతో పలు వాహనాలు పట్టుకోల్పోయి ముందున్న వాహనాలను ఢీకొట్టాయి. మొత్తంగా 48 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. పూణెలోని నవాలే బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పుణె మెట్రోపాలిటన్‌ ప్రాంత అభివృద్ధి సంస్థ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

వేగంగా వచ్చిన ఓ ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి ముందున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. దాంతో ట్యాంకర్ లోని ఆయిల్ లీకై రోడ్డు మీద పడింది. దాని కారణంగా మరిన్ని వాహనాలు రోడ్డుపై పట్టు కోల్పోయి ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకే చోట పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటనతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చాలా కార్లు వాటి ముందున్న కంటైనర్ల కిందకి చొచ్చుకుపోయి నుజ్జునుజ్జయ్యాయి. ఈ ప్రమాదాన్ని చిత్రీకరించిన కొందరు ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.