రోజుకి 4 గంటలు..వారానికి 4 రోజులే డ్యూటీ..! - MicTv.in - Telugu News
mictv telugu

రోజుకి 4 గంటలు..వారానికి 4 రోజులే డ్యూటీ..!

June 22, 2017

వారానికి ఒకరోజు సెలవ్ కామన్..రెండు రోజులు సూపర్. మరి ముచ్చటగా మూడు రోజులు ఉంటే…వింటేనే ఫుల్ ఖుషీ అయ్యే కబురు చెప్పింది ఎవరో తెలుసా…మాములోడు కాదు బిలియనీర్.నిజంగా ఇది అమల్లోకి వస్తే ఎవరూ లీవ్ మాట ఎత్తేరేమో…ఆ కోటిశ్వరుడు అన్నట్టు వారానికి మూడురోజులు విశ్రాంతి దొరికితే..?

ఎక్కడో చూసినట్టు అనిపించే ఇతని పేరు జాక్ మా. అదే అలీ బాబా కంపెనీ వ్యవస్థాపకుడు. ఈయన మామూలుగా మాట్లాడితే పెద్దగా పట్టించుకోనక్కరలేదు. కానీ అందరినీ ఆలోచించే..అందరి మనస్సుకు నచ్చేలా ముచ్చటించారు. అందుకే ఈ బిలియనీర్ గురించి చెప్పుకోవాల్సిందే. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెల్స్ పుణ్యమా అని భవిష్యత్తులో ప్రజల జీవితం మరింత సుఖమయం కానుందని అంటున్నారు. వచ్చే 30 ఏళ్లలో ప్రజలు రోజుకు కేవలం 4 గంటల మాత్రమే పనిచేస్తారని, అది కూడా వారానికి నాలుగు రోజులు మాత్రమే..అని జాక్ మా చెబుతున్నారు.

గేట్‌వే 17 కాన్ఫరెన్సులో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు మాట్లాడారు. ‘‘ మా తాతగారు పొలంలో రోజుకు 16 గంటలు పనిచేశారు. దీన్ని బట్టి అప్పుడు చాలా బిజీగా ఉండి ఉంటారు. ఇప్పుడు మనం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నాం. అది కూడా వారానికి 5 రోజులు పని చేస్తూ చాలా బిజీగా ఉన్నట్టు అనుకుంటున్నాం’’ అని చెప్పకొచ్చారు. ఎన్ని మెషిన్లు వచ్చినా అవి ప్రవర్తన విషయంలో మనుషుల పాత్రను భర్తీ చేయలేవన్నారు. అయితే రోజు రోజుకూ దూసుకొస్తున్న టెక్నాలజీతో మాత్రం పెను సమస్యలు తప్పవన్నారు. అది యుద్ధానికి కూడా దారితీయవచ్చునని ఆయన చెబుతున్నారు. ఆయన అన్నట్టు వారానికి మూడు రోజుల సెలవులేమో గానీ మూడో తరం టెక్నాలజీ విప్లవంతో మూడో ప్రపంచ యుద్ధం వచ్చినా రావొచ్చు.