4జీ స్పీడ్‌లో అధమస్థానంలో భారత్.. పాక్ మనకంటే చాలా బెటర్ - MicTv.in - Telugu News
mictv telugu

4జీ స్పీడ్‌లో అధమస్థానంలో భారత్.. పాక్ మనకంటే చాలా బెటర్

February 22, 2018

మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇంటింటికీ ఇంటర్నెట్ అని మన పాలకులు పట్టపగలే చుక్కలు చూపుతున్న కాలం ఇది. అయితే వాస్తవం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది. కమ్యూనికేషన్లకు ఆహారం, నీరు అంత అవసరంగా మారిపోయి 4జీ స్పీడ్‌ భారత్ లో అత్యంత దారుణంగా ఉందని మొబైల్ అనలిటిక్స్ కంపెనీ ఓపెన్ సిగ్నల్  వెల్లడించింది.

అక్కడ  సగటు 4జీ స్పీడ్ 6 ఎంబీపీస్ మాత్రమేనని తెలిపింది.  పలు కంపెనీలు 4జీ సర్వీసులతో యూజర్లను ఊరిస్తున్నా వేగం మాత్రం తీసికట్టేనని పేర్కొంది. ఈ విషయంలో భారత్ కంటే పాకిస్తాన్, కజకిస్తాన్, అల్జీరియా, ట్యునీషియాలు దేశాలు ముందంజలో ఉన్నాయంది.

కంపెనీ అధ్యయన వివరాల ప్రకారం.. 88 దేశాలతో పోల్చితే భారత్‌లో 4జీ డౌన్‌లోడ్ వేగం హీనంగా ఉంది. పాకిస్థాన్‌లో 4జీ స్పీడ్ 14 ఎంబీపీఎస్‌, అల్జీరియాలోనూ 9 ఎంబీపీఎస్. ఇక సింగపూర్ 44 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో అగ్రస్థానంలో ఉంది.  

42 ఎంబీపీఎస్‌తో నెదర్లాండ్స్ రెండో స్థానంలో, తర్వాత స్థానాల్లో నార్వే (41), దక్షిణ కొరియా (40), హంగేరీ (39) తదితరాలు ఉన్నాయి. భారత దేశంలో ఎయిర్ టెల్, జియో, ఐడియా వంటి భారీ నెట్‌వర్క్ కంపెనీలు ఉన్నా, వ్యవస్థాగత లోపాలు, ప్రజలు తమ సర్వీసులు అప్ డేట్ చేసుకోకపోవడం, వెనుకబడిన టెక్నాలజీ తదితర కారణాల వల్ల 4జీ స్పీడ్‌ మందగించింది.