మెదక్ జిల్లాలోని నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంకులో రూ. 5.20 కోట్ల డబ్బు దుర్వినియోగం అయింది. ఈ మేరకు ఆడిట్లో తేలగా, తనకేమీ తెలియదని మేనేజరు చెప్తున్నారు. పూర్తి వివరాలు.. నిధుల గోల్మాల్పై ఆరోపణలు రాగానే ఉన్నతాధికారులు ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించారు. ఆడిటర్లను పంపి ఈ నెల 21న అర్ధరాత్రి వరకు, 22న బ్యాంకు, ఏటీఎంలు మూసేసి నాలుగు రోజుల పాటు ఆడిట్ చేయగా, పై మొత్తంలో డబ్బు లెక్క లేదని తేల్చారు. ఇంకా బ్యాంకులో రుణాల కోసం తనఖా పెట్టిన బంగారు నగలను ఆడిట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే నిధులు లేవని ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో ఓ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అనంతరం ఈ అంశంపై దర్యాప్తు చేయాలని బ్యాంకు ఉన్నతాధికారులు ఓ దర్యాప్తు సంస్థను కోరారు. ఈ విషయంపై మీడియా బ్యాంకు మేనేజరు నర్సయ్య వివరణ కోరగా, తనకేమీ తెలియదని వ్యాఖ్యానించారు. ఆడిట్ మొత్తం బ్యాంకు ఉన్నతాధికారులు పర్యవేక్షించారనీ, తనకు ఎలాంటి వివరాలు తెలియవని అభిప్రాయపడ్డారు.