Home > Featured > ఒకే గణపతి ఉంటే,  5 లక్షలు.. దేవరకద్ర ఎమ్మెల్యే  ఆఫర్..

ఒకే గణపతి ఉంటే,  5 లక్షలు.. దేవరకద్ర ఎమ్మెల్యే  ఆఫర్..

5 Lakh Would Be Allotted

మరికొద్ది రోజుల్లో వినాయక చవితి వస్తోంది. పండగ సందర్భంగా సాంప్రదాయులకు ఆనందమే కానీ, పర్వావరణ ప్రేమికులకు ఈ పండగ ఓ సమస్యలా కనిపిస్తుంది. రంగురంగుల గణపతుల మధ్య ఊరూవాడలు డీజే సౌండ్‌లతో మారుమోగిపోతాయి. దీంతో ధ్వని, వాయు, నీటి కాలుష్యం జరుగుతుంది. రంగుల గణపతులు వద్దు మట్టి గణపతులనే వాడండని ఎవరైనా అంటే వారిమీదకు సాంప్రదాయవాదుల దాడి మొదలవుతుంది. ఫక్తు హిందువుల పండగల మీద పడి ఏడుస్తారు పనీపాటాలేనివాళ్లని ఆడిపోసుకుంటారు. దీంతో చాలామంది ఈ విషయాన్ని చెప్పడానికి వెనకాడే పరిస్థితి నెలకొంది? ఈ క్రమంలో ప్రజలను మేలుకొలిపేది ప్రజానాయకుడే అని భావించినట్టున్నారు ఓ ఎమ్మెల్యే.

ఊరికి ఒకటే గణపతి పెట్టండి.. అది కూడా మట్టి గణపతినే ప్రతిష్ఠించండి అని తన నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. అలా ఒకటే మట్టి గణపయ్యను పెట్టినవారికి రూ.5 లక్షలు బహుమతిగా ఇస్తానని కూడా ప్రకటించారు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి. ఈ ప్రకటన చేయడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించారు. ‘నా చిన్నప్పుడు ఊరి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఒకే గణేషుడిని పెట్టుకునేవాళ్లం. దీంతో గ్రామస్ధులు అందరూ ఒకేచోట కలిసి భక్తి శ్రద్ధలతో భజనలు చేసేవారం. ఇప్పుడు కూడా అలాంటి వాతావరణం రావాలంటే.. ఊరిలో ఒకే విగ్రహం పెట్టుకోవాలి. అలా చేస్తే రూ.5 లక్షల బహుమతి ఇస్తామని నిర్ణయం తీసుకున్నాం. ఒకే విగ్రహం ఉన్న గ్రామాలను గుర్తించేందుకు కమిటీ ఏర్పాటు చేశాం. ఈ క్రమంలో ఊరిలో ఒకే వినాయక విగ్రహం ఉన్న గ్రామానికి రూ.5లక్షలు వెంటనే మంజూరు చేస్తాం’ అని వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. అలాగే మట్టి విగ్రహాలు పెట్టుకునే ఆసక్తి ఉన్నవారికి ఫ్రీగా మట్టి విగ్రహాలను అందిస్తామని తెలిపారు.

Updated : 27 Aug 2019 10:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top